IPL: కాయ్ రాజా కాయ్!.. కోటిశ్వరులను సైతం రోడ్డున పడేసే బెట్టింగ్ భూతం యాప్స్!

IPL: క్రికెట్ అభిమానులను 60 రోజులపాటు ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన వెంటనే బెట్టింగ్ దందా కూడా ఉధృతమైంది. డిజిటల్ ఇండియా ఫౌండేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈసారి ఐపీఎల్ సీజన్ ముగిసే సరికి దేశవ్యాప్తంగా బెట్టింగ్ వ్యాపారంలో రూ.10000 కోట్లకు పైగా డబ్బు చేతులు మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒక్క రాష్ట్రంలోనే ఈ మొత్తం రూ.1000 కోట్లకు మించి ఉండొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని అప్పులపాలై చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం, వందలాది కుటుంబాలు ఆర్థికంగా కుదేలవడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సమగ్ర చట్టాల లోపం, ఉన్న నిబంధనల్లో ఉన్న లోసుగుల వల్ల ఈ అక్రమ వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టలేకపోతున్నామని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.

మన దేశంలో క్రికెట్ బెట్టింగ్ కొత్త విషయం కాదు. రెండు, మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ దందా, గతంలో పూర్తిగా ప్రత్యక్షంగా నడిచేది. అయితే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో ఇప్పుడు ఇది పూర్తిగా డిజిటల్ రూపం దాల్చింది. ఒకప్పుడు పరిమితంగా ఉన్న ఈ వ్యవస్థ ఇప్పుడు ఆక్టోపస్‌లా విస్తరించి నియంత్రణకు అందకుండా పోయింది. అధునాతన సాంకేతికతలను వినియోగిస్తూ ఈ మాఫియా తమ కార్యకలాపాలను మరింత విస్తరించింది. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ ఫాంలలో బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు వరదలా వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ బజ్, మోస్ట్ బెల్, పరీ మ్యాచ్, 22బెట్స్, మెల్ బెట్, 1ఎక్స్ బెట్ వంటి పేర్లతో ప్రస్తుతం 80కి పైగా యాప్‌లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

ఒకవైపు ఆన్‌లైన్‌లో బెట్టింగ్ వ్యాపారం విస్తరిస్తుండగా, మరోవైపు ప్రత్యక్షంగా కూడా ఈ దందా కొనసాగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు తమ ఇళ్లలోనే లేదా అద్దెకు తీసుకున్న ఫ్లాట్లు, ఇండ్లు, ఫార్మ్ హౌస్‌లలో బెట్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా బెట్టింగ్‌లను స్వీకరించి, కంప్యూటర్లలో రికార్డులు నమోదు చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికత సహాయంతో మిల్లీ సెకన్‌లలోనే రియల్ టైం సమాచారం అప్డేట్ చేయడం వీరి ప్రత్యేకతగా మారింది.

గతంలో బెట్టింగ్ ప్రధానంగా మ్యాచ్ ఫలితాలకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టాస్ ఎవరు గెలుస్తారు, మొదట బ్యాటింగ్ ఎవరు చేస్తారు, మొదటి బంతికి బౌండరీ పడుతుందా, ఏ ఓవర్‌లో ఎన్ని పరుగులు వస్తాయి, మ్యాచ్‌లో ఎన్ని నో బాల్స్, ఎన్ని వైడ్స్ ఉంటాయి, ఏ బౌలర్ ఎన్ని పరుగులు ఇస్తాడు, ఏ బ్యాటర్ అర్ధశతకం లేదా శతకం సాధిస్తాడా వంటి ప్రతీ చిన్న అంశంపైనా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. రూ.100 నుంచి ప్రారంభమై లక్షల రూపాయల వరకు ఈ బెట్టింగ్‌లు సాగుతున్నాయి.

ప్రభుత్వాలు, పోలీసు శాఖలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, బెట్టింగ్ వ్యసనంలో చిక్కుకున్న వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో సుమారు 34 కోట్లకు పైగా బెట్టింగ్ లావాదేవీలు జరిగినట్లు అంచనా. ఈ నేపథ్యంలో వేలాది మంది తమ సంపాదించిన ఆస్తులన్నీ కోల్పోయి ఆర్థికంగా కుదేలయ్యారు. మరికొందరు తీవ్ర ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకోవడం వంటి దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి.

నిజానికి రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగ్ యాప్‌లపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, కొన్ని యాప్‌లు కేంద్ర అనుమతితో నడుస్తున్నాయి. అయితే వాటిని డౌన్‌లోడ్ చేసుకుని డబ్బు పెట్టడం చట్ట విరుద్ధమే. అయినప్పటికీ విదేశాల నుంచి నిర్వహిస్తున్న అనేక యాప్‌లు ద్వారా ఈ దందా నిరాటంకంగా కొనసాగుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండటం, తేలికగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇలాంటి అక్రమ మార్గాల్లోకి వెళ్లకపోవడం అత్యంత అవసరమని సూచిస్తున్నారు.

ALSO READ: Vishakhapatnam: నమ్మితే నామం పెట్టాడు!.. 30 సిలిండర్లతో జంప్!

Last Updated on March 28, 2026 · 11:39 PM by Star Trinethram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles