Ponguleti Srinivasa Reddy: వర్ధన్నపేటలో రూ.294 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Ponguleti Srinivasa Reddy: పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నది ప్రజా ప్రభుత్వం అని రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో సోమవారం సుమారు రూ.294 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధిగా మలచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో టీయూఎఫ్‌ఐడీసీ తదితర నిధులతో రూ.20 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, పార్కుల అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. అదనంగా రూ.200 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.3.5 కోట్లతో స్పోర్ట్స్ స్టేడియం, సబ్ జైల్ నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. మొత్తం రూ.294 కోట్ల అభివృద్ధి పనులు వర్ధన్నపేట రూపురేఖలను మార్చనున్నాయని మంత్రి అన్నారు.

ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా.. పేదలపై భారం మోపకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి వివరించారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ధనికులు వినియోగించే సన్న బియ్యాన్ని పేదలకు రేషన్ రూపంలో అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ కార్డులు జారీ చేసి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసినట్లు చెప్పారు.

హాస్టళ్లలో చదువుతున్న పేద విద్యార్థుల పరిస్థితిని కూడా ప్రస్తావించిన మంత్రి.. గతంలో వారికి సరైన భోజనం కూడా అందలేదని విమర్శించారు. ప్రస్తుతం డైట్ చార్జీలను 40 శాతం పెంచడంతో పాటు బాలికలకు కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లను నిర్మిస్తున్నామని చెప్పారు.

పేదలకు ఇళ్ల విషయంలోనూ ప్రజా ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తోందని మంత్రి అన్నారు. మొదటి విడతలో 4 లక్షల 20 వేల ఇళ్లను రూ.22,500 కోట్లతో, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఉచితంగా మంజూరు చేశామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చామని, వర్ధన్నపేటకు కూడా వాటా దక్కిందని తెలిపారు. ఏప్రిల్‌లో రెండో విడత, మూడో దఫాలోనూ ఇళ్లను మంజూరు చేస్తామని, పేదవారికి పార్టీతో సంబంధం లేకుండా ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు.

రైతు సంక్షేమంపై కూడా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతును రాజును చేస్తామని చెప్పిన ప్రజా ప్రభుత్వం.. వరికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చిందని చెప్పారు. రైతు బంధు కింద గతంలో రూ.10 వేలే ఇస్తే, ఇప్పుడు రూ.12 వేలు అందిస్తున్నామని తెలిపారు. కేవలం 9 నెలల్లోనే రూ.21 వేల కోట్లతో 26 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, గత ప్రభుత్వం పదేళ్లలో రూపాయి కూడా మాఫీ చేయలేదని విమర్శించారు.

ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు చేయడం సమంజసం కాదని పొంగులేటి వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్, పవర్ కొనుగోళ్లు, రేసుల వ్యవహారాల్లో తప్పు చేసినవారు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీని నందనవనంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

ALSO READ: Aroori Ramesh: బీజేపీకి ఆరూరి రమేష్ రాజీనామా.. త్వరలో బీఆర్ఎస్‌లో చేరిక

Last Updated on January 27, 2026 · 3:35 AM by Star Trinethram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles