ఆదివారం రాగానే మాంసం షాపుల వద్ద సందడి మొదలవుతుంది. చికెన్, మటన్ కోసం చాలా మంది ఉరుకులు పెడుతుంటారు. రేటు బోర్డు వైపు ఓ చూపు వేసి, కావాల్సిన పరిమాణాన్ని ఆర్డర్ చేయడం సాధారణంగా కనిపించే దృశ్యం. ఈ క్రమంలో చికెన్‌లో స్కిన్ ఉన్న కోడికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే వారు కూడా కొరవడటం లేదు. చర్మంతో కూడిన కోడిని తీసుకుని, గ్యాస్ స్టౌలపై లేదా ఎలక్ట్రిక్ స్టౌలపై కాల్చించి మరీ ముక్కలు చేయించుకునే ట్రెండ్ పెరుగుతోంది. అయితే ఇలా ఏరికోరి తీసుకెళ్లే స్కిన్ చికెన్ నిజంగానే ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదన్న ప్రశ్న ఇప్పుడు చాలామందిని వెంటాడుతోంది.
స్కిన్ చికెన్ తినాలా? వద్దా? అన్నదానిపై ఎన్నో అపోహలు ఉన్నాయి. కొందరు రుచి కోసమే తహతహలాడుతుంటే, మరికొందరు ఆరోగ్య సమస్యలు వస్తాయేమోనని సందేహపడుతుంటారు. అయితే నిపుణుల మాట ప్రకారం కోడి చర్మం పూర్తిగా చెడ్డదని చెప్పలేం, అలాగే పూర్తిగా మంచిదని కూడా చెప్పలేం. ఇందులో ఉన్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్లో ఉండే మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ లాగానే ఇవి గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు. అంతేకాదు, కోడి చర్మంలో కొంత ప్రోటీన్, కాలజెన్ కూడా ఉండటంతో చర్మం, కండరాలు, కీళ్లకు బలం చేకూరుతుంది. ఈ ప్రయోజనాల గురించి తెలియకుండానే చాలామంది కేవలం రుచి కోసమే స్కిన్ చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
అదే సమయంలో కోడి చర్మం అధిక కేలరీలు, ఎక్కువ కొవ్వు కలిగిన భాగం కావడం గమనించాల్సిన అంశం. ఒక ఔన్స్ చికెన్ స్కిన్‌లో సుమారు 90 నుంచి 128 కేలరీలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తరచుగా, అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే స్కిన్ చికెన్‌ను మితంగా మాత్రమే తీసుకోవాలని, వారానికి ఒకసారి లేదా నెలలో నాలుగు నుంచి ఐదు సార్లకు మించకుండా తినడం మంచిదని సూచిస్తున్నారు. అప్పుడే ఆరోగ్యానికి, గుండెకు మేలు జరుగుతుందని అంటున్నారు.
చికెన్‌ను కాల్చే విధానాలపైనా జాగ్రత్త అవసరం. చాలా మంది రుచి బాగుంటుందని కట్టెల పొయ్యిపై కాల్చిన కోడినే ఇష్టపడతారు. అయితే అలాంటి పొగలో పాలీసైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్స్, హెటిరోసైక్లిక్ అమైన్స్ వంటి హానికారక రసాయనాలు విడుదలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు కూడా దారి తీయొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్ల గాలి సరిగా బయటకు వెళ్లే విధంగా ఉన్న గ్యాస్ స్టౌలు లేదా పొగ లేకుండా పనిచేసే ఎలక్ట్రిక్ స్టౌలపై వండిన చికెన్నే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఆరోగ్య పరంగా చూస్తే స్కిన్లెస్ చికెన్‌లో బ్రెస్ట్ పీస్ అత్యుత్తమ ఎంపికగా నిపుణులు చెబుతున్నారు. లెగ్ పీస్‌లతో పోలిస్తే బ్రెస్ట్ భాగంలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. సంతృప్త కొవ్వు తక్కువగా ఉండటంతో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే కండరాల పెరుగుదలకు, శరీర కణాల మరమ్మతుకు అవసరమైన అధిక ప్రోటీన్ అందుతుంది. స్కిన్ లేకుండా వాడటం వల్ల కేలరీలు తగ్గి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారుతుంది. లీన్ మీట్ కావడంతో సులభంగా జీర్ణం అవుతుంది.
స్కిన్ ఉన్నా, లేకపోయినా చికెన్‌లో విటమిన్ B6, B12, నియాసిన్, సెలనియం, ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెటబాలిజం మెరుగుపడటానికి, రక్తకణాల ఉత్పత్తికి, రోగనిరోధక శక్తి పెరగడానికి అవసరం. అయితే వండే విధానం, తీసుకునే పరిమాణమే అసలైన కీలకం. తాజా చికెన్‌ను మాత్రమే ఎంచుకోవాలి. ఉడికించడం, గ్రిల్ చేయడం, బేక్ చేయడం వంటి ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలి. సరైన ఉష్ణోగ్రతలో పూర్తిగా ఉడకకపోతే బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే డీప్ ఫ్రైలు, అధికంగా స్కిన్ చికెన్ తీసుకుంటే గుండె జబ్బుల ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Oppo మైండ్ బ్లోయింగ్ స్కెచ్.. రూ.11 వేలకే 220MP సెన్సార్
Last Updated on February 8, 2026 · 12:55 PM by Star Trinethram



