Viral Video: నేటి యువత ఆలోచనా ధోరణి ఏ దిశగా సాగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు విలువలు, సంస్కారం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకున్న భారతీయ సమాజంలో ఇప్పుడు రోజుకో కలవరపెట్టే ఘటన వెలుగులోకి వస్తోంది. తల్లిదండ్రులు, గురువులు, పెద్దల పట్ల గౌరవం అనే భావన క్రమంగా కరిగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా చదువు చెప్పే గురువుల పట్ల కొందరు విద్యార్థులు ప్రదర్శిస్తున్న వైఖరి సమాజాన్నే తలదించుకునేలా చేస్తోంది. ‘ఆచార్య దేవోభవ’ అంటూ గురువును దైవంతో సమానంగా గౌరవించే సంప్రదాయం మనది. అలాంటి గొప్ప సంస్కృతిలో పెరిగిన ఈ తరం నుంచి ఇలాంటి క్రూర ఘటనలు బయటకు రావడం ఆందోళనకు గురిచేస్తోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట గురువులే ప్రాణభయంతో జీవించాల్సిన పరిస్థితులు రావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
In #Mainpuri district of #UttarPradesh, a 12th-grade student severely bit his former school teacher on the lips. The student had a history of engaging in inappropriate behavior. The teacher had complained to his parents about his actions, which angered
1/2 pic.twitter.com/z2sV3cRyuM— Siraj Noorani (@sirajnoorani) February 5, 2026
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఒక ఘోర ఘటన పవిత్రమైన గురు-శిష్యుల బంధానికే మాయని మచ్చగా మారింది. మెయిన్‌పురి జిల్లాలోని రాధాకృష్ణ ఇంటర్ కాలేజీలో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన టీచర్‌పై అమానుషంగా దాడి చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం రోజున తరగతి ముగించుకుని బయటకు వెళ్తున్న సమయంలో ఆ విద్యార్థి ఆమెను అడ్డగించి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. మాటల తూటాలతోనే ఆగని అతడు ముందుగానే సిద్ధం చేసుకుని తెచ్చుకున్న పదునైన ఆయుధంతో దాడికి తెగబడ్డాడు. టీచర్ అన్న కనీస గౌరవం లేకుండా ఆమె పెదాలను కోసి తన క్రూరత్వాన్ని చాటుకున్నాడు. ఈ ఘటన అక్కడున్న వారిని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.
ఇంతటితో ఆగకుండా సదరు విద్యార్థి తుపాకీతో కాల్చేందుకు కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఆ తుపాకీ పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే పరిస్థితి మరింత విషమంగా మారేదని స్థానికులు చెబుతున్నారు. రక్తపు మడుగులో పడిపోయిన టీచర్ కేకలు వేయడంతో పాఠశాల సిబ్బంది, సమీపంలో ఉన్నవారు అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు. దృశ్యం చూసి అందరూ భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను చికిత్స కోసం సైఫాయ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.
బాధితురాలు భోగాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. సదరు విద్యార్థి ప్రవర్తన గత కొంతకాలంగా సరిగా లేదని, క్రమశిక్షణకు భంగం కలిగిస్తున్నాడని ఆమె పలుమార్లు మందలించినట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని మనసులో పెట్టుకున్న విద్యార్థి, గురువుపై కక్ష పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. చిన్నపాటి మందలింపునే అతడు అవమానంగా భావించి, ఇంతటి అమానుష చర్యకు దిగడం కలవరపెడుతోంది.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పాఠశాలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన విద్యార్థి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్థానికులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురువుపై ఇలాంటి దాడికి పాల్పడిన విద్యార్థిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
కుటుంబంలో సరైన మార్గనిర్దేశం లేకపోవడం, సమాజంలో విలువలు క్షీణించడం, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలు యువతను తప్పుదారిలోకి నెడుతున్నాయన్న చర్చ మొదలైంది. చదువు చెప్పే గురువులే సురక్షితంగా లేకపోతే, భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్నాయి.
ALSO READ: Tollywood actor: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
Last Updated on February 6, 2026 · 9:38 AM by Star Trinethram



