Golden Chance: హనుమకొండ పోస్టల్ డివిజన్ పరిధిలో ప్రజలకు పోస్టల్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఇండియన్ పోస్ట్ ఫ్రాంచైజీ విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ వి. హనుమంతు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోస్టాఫీస్ సేవలు పూర్తిగా అందని ప్రాంతాలు, లేదా ఉన్న పోస్టాఫీసులపై అధిక భారం ఉన్న ప్రాంతాల్లో ఈ ఫ్రాంచైజీల ద్వారా సేవలను అందించనున్నారు. ఈ విధానం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రజలకు అవసరమైన పోస్టల్ సేవలను సులభంగా అందించడమే ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ నిరాశ చెందుతున్న యువతకు, అలాగే కొత్తగా చిన్న వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న వారికి ఈ పోస్టాఫీస్ ఫ్రాంచైజీలు ఒక సువర్ణ అవకాశంగా మారుతున్నాయి. పెద్ద పెట్టుబడి అవసరం లేకుండానే, స్వంత ఊరిలోనే ఉంటూ వ్యాపారం చేసుకునే అవకాశం ఈ స్కీమ్ ద్వారా లభిస్తోంది. కేవలం పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఈ వ్యాపారం ప్రారంభించి నెలకు వేల రూపాయల ఆదాయం పొందవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది స్థిరమైన ఆదాయ వనరుగా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్ ముఖ్య ఉద్దేశం పోస్టాఫీస్ లేని ప్రాంతాల్లో లేదా పోస్టల్ సేవలకు ఎక్కువ డిమాండ్ ఉన్న చోట్ల ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కౌంటర్ సేవలు అందించడమే. దీనినే ఇండియన్ పోస్ట్ ఫ్రాంచైజీ స్కీమ్‌గా పిలుస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 1.55 లక్షల పోస్టాఫీసులు ఉన్నప్పటికీ, వాటిపై భారం తగ్గించేందుకు మరియు సేవలను వేగవంతం చేసేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఫ్రాంచైజీల ద్వారా రిజిస్టర్డ్ పోస్టులు, స్పీడ్ పోస్టులు బుకింగ్, స్టాంపులు, స్టేషనరీ విక్రయం, మనీ ఆర్డర్ సంబంధిత సేవలు వంటి కీలక పోస్టల్ సదుపాయాలు అందిస్తారు.
ఈ స్కీమ్‌లో రెండు రకాల ఫ్రాంచైజీలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఒకటి ఫ్రాంచైజీ అవుట్‌లెట్ కాగా, రెండవది పోస్టల్ ఏజెంట్ల ఫ్రాంచైజీ. ఫ్రాంచైజీ అవుట్‌లెట్ ద్వారా కౌంటర్ సేవలు అందిస్తారు. పోస్టల్ ఏజెంట్ల ఫ్రాంచైజీ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి స్టాంపులు, స్టేషనరీ పంపిణీ చేసే విధంగా సేవలు కొనసాగిస్తారు. అవసరాన్ని బట్టి అభ్యర్థులు ఈ రెండు విధానాల్లో ఏదైనా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది.
పోస్టల్ ఫ్రాంచైజీ పొందాలంటే కనీసం 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరుడై ఉండాలి. దరఖాస్తుదారులకు కనీసంగా 200 చదరపు అడుగుల స్థలం లేదా చిన్న షాపు ఉండాలి. అలాగే సుమారు రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్, ఇంటర్నెట్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం స్థానిక పోస్టాఫీస్ లేదా పోస్టల్ డివిజన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, స్థలం సంబంధించిన డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఫ్రాంచైజీల ద్వారా ఆదాయ అవకాశాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. నెలకు వెయ్యికి పైగా రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్టులను బుక్ చేస్తే అదనంగా 20 శాతం వరకు కమిషన్ పొందే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ వ్యాపారం ద్వారా నెలకు సుమారు రూ.20,000 నుంచి రూ.80,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హనుమకొండ పోస్టల్ డివిజన్ పరిధిలో ఫ్రాంచైజీలకు దరఖాస్తు చేసుకునే అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం [email protected] ను సంప్రదించాలని పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ వి.హనుమంతు సూచించారు.
ALSO READ: Municipal Elections: అసలు తగ్గేదే లే అంటున్న ఆరూరి సైన్యం
Last Updated on February 5, 2026 · 2:46 PM by Star Trinethram



