Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 5 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన సంక్షోభం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మధ్య జరిగిన ఈ పర్యటన భారత్‌కు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కీలక మలుపుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇంధన భద్రత, రక్షణ సహకారం, పెట్టుబడుల విస్తరణ వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదరడం విశేషంగా మారింది.
మే 15న అబుదాబి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈ ప్రభుత్వం అత్యంత ఘనంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఆ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు భద్రతా ఎస్కార్ట్‌గా మారి అబుదాబి వరకు వెంట వచ్చాయి. విమానాశ్రయంలో ప్రధాని గౌరవ వందనం స్వీకరించగా, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ద్వైపాక్షిక సమావేశాల్లో ఇరు దేశాలు వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య వ్యవస్థపై కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరుగుతూ అనేక దేశాల్లో ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్న తరుణంలో భారత్ మాత్రం ఇంధన భద్రత విషయంలో ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఒపెక్ కూటమి పరిమితుల నుంచి యూఏఈ బయటకు రావడం వల్ల క్రూడాయిల్ ఉత్పత్తిపై నియంత్రణలు సడలిన నేపథ్యంలో భారత్ దీనిని వ్యూహాత్మక అవకాశంగా మార్చుకుంది. ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ సరఫరాను నిరంతరంగా కొనసాగించేలా ఇరు దేశాలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. దీంతో భవిష్యత్తులో ఇంధన కొరత పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు మరింత బలపడనుందని నిపుణులు భావిస్తున్నారు.
ఆర్థిక రంగంలో కూడా ఈ పర్యటన ద్వారా భారత్‌కు భారీ పెట్టుబడులు రానున్నాయి. భారత మౌలిక సదుపాయాలు, ఆర్‌బిఎల్ బ్యాంక్, సమ్మాన్ క్యాపిటల్ రంగాల్లో సుమారు రూ.41000 కోట్ల విలువైన 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ అంగీకరించింది. అదేవిధంగా వడినార్ ప్రాంతంలో నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుకు సంబంధించి మరో కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుందని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా యూఏఈపై జరుగుతున్న దాడులను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పశ్చిమాసియాలో నెలకొన్న సమస్యలకు యుద్ధం శాశ్వత పరిష్కారం కాదని, చర్చలు మరియు దౌత్య సంబంధాల ద్వారానే శాంతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అరేబియా తీరం నుంచి ఐరోపా దేశాల వరకు సాగనున్న ఈ విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని తదుపరి దశలో నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్ దేశాల్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా 43 ఏళ్ల తర్వాత నార్వే పర్యటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటలీతో రక్షణ సంబంధాలు, స్వీడన్‌తో వాణిజ్య భాగస్వామ్యం, నెదర్లాండ్స్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది.
ALSO READ: Natural Gas: LPG, CNG, PNG, LNG మధ్య తేడా ఏంటో తెలుసా?
