HomeజాతీయంSnake Rescue: ఏంటీ మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా..

Snake Rescue: ఏంటీ మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా..

📰 Generate e-Paper Clip

Snake Rescue: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాములు జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక చల్లని ప్రదేశాల కోసం పాములు ఇళ్లలోకి రావడం ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నది. ఇలాంటి పరిణామాలు ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది.

కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా తాలూకా హలవల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. సుమారు 16 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ఒక ఇంట్లోకి చేరి తిష్టవేసింది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పామును చూసిన వెంటనే భయంతో పరుగులు తీశారు. ఈ విషయం గ్రామంలో వేగంగా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్‌లకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్ సూరజ్ శెట్టి అరబైల్, హరీష్ మడివాళ అటవీ శాఖ అధికారుల సహకారంతో ఘటనాస్థలానికి చేరుకుని రక్షణ చర్యలను ప్రారంభించారు. ఇంట్లో ఇరుకైన ప్రదేశంలో దాగి ఉన్న ఆ కొండచిలువను ఎలాంటి ప్రమాదం లేకుండా పట్టుకోవడం సవాల్‌గా మారింది. అయినప్పటికీ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిన బృందం, ఎవరికి హాని కలగకుండా ఆ పామును విజయవంతంగా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ మొత్తం ఎంతో జాగ్రత్తగా నిర్వహించబడింది.

పట్టుబడిన సుమారు 16 అడుగుల పొడవున్న ఆ కొండచిలువను అటవీ శాఖ మార్గదర్శకాల ప్రకారం జనావాసాలు లేని దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించి సురక్షితంగా వదిలివేశారు. పామును హానిచేయకుండా రక్షించి తిరిగి సహజ నివాసంలోకి విడిచిపెట్టినందుకు స్నేక్ క్యాచర్ సూరజ్ శెట్టి మరియు అతని బృందంపై గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.

ఇటీవల మల్నాడు, తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ కారణంగా చల్లని వాతావరణం కోసం పాములు ఇళ్లలోకి, జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాములు కనిపించినప్పుడు స్వయంగా పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే అటవీ శాఖ లేదా నిపుణులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ: Hyderabad: పెరుగు ఎంత పని చేసింది?.. భర్తపై అలిగి వెళ్లిపోయిన భార్య

RELATED ARTICLES

Most Popular