HomeUncategorizedCabinet Expansion: 2029లో కేబినెట్‌ విస్తరణలో లక్కీ ఛాన్స్ ఎవరికో?

Cabinet Expansion: 2029లో కేబినెట్‌ విస్తరణలో లక్కీ ఛాన్స్ ఎవరికో?

📰 Generate e-Paper Clip

Cabinet Expansion: కేంద్ర రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎప్పటినుంచో పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతుందనే ప్రచారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మంత్రివర్గ విస్తరణకు సిద్ధత జరుగుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మే నెలలోనే ఈ విస్తరణ చేపడతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈసారి విస్తరణలో కొంతమందికి శాఖల మార్పులు, కొత్తవారికి అవకాశాలు, మరికొంతమందికి పదవుల కోతలు ఉండే అవకాశం ఉందన్న ప్రచారం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రానున్న జూన్‌తో 2 సంవత్సరాలు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై చర్చలు వేగం అందుకున్నాయి. గత విస్తరణలో అవకాశాలు కోల్పోయిన నేతలు ఈసారి తమకు అవకాశం కల్పించాలని కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇదే సమయంలో దేశంలో 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే పెద్ద ఎత్తున మంత్రివర్గ మార్పులు ఉంటాయన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో బీహార్‌కు చెందిన సీనియర్ నేత నితీష్ కుమార్‌కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు కూడా ఈసారి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు మంత్రులు కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తుండగా, అదనంగా మరికొందరికి అవకాశం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నేతల పేర్లు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన అమలాపురం యువ ఎంపీ హరీష్ బాలయోగికి కూడా అవకాశం లభించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. గతంలో లోక్‌సభ సభాపతిగా పనిచేసిన జిఎంసి బాలయోగి సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ నుంచి కూడా ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రస్తుత మంత్రుల శాఖల్లో కూడా మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్రమంత్రుల బాధ్యతల్లో మార్పులు ఉంటాయన్న ప్రచారం కొనసాగుతోంది. ముఖ్యంగా కిషన్ రెడ్డి మరియు రామ్మోహన్ నాయుడు వంటి నేతల శాఖల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్‌కు పదోన్నతి లభించే అవకాశముందని, స్వతంత్ర బాధ్యతలతో కూడిన శాఖ కేటాయించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక రాబోయే 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన బృందాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరు, ప్రాంతీయ సమీకరణాలు, రాజకీయ లెక్కలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు ఉండనున్నాయి. పార్లమెంట్ సమావేశాలు, రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తైన వెంటనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కేంద్ర రాజకీయాల్లో ఎవరికీ అవకాశం దక్కుతుంది, ఎవరు పదవి కోల్పోతారు, ఏ రాష్ట్రాలకు ప్రాధాన్యత పెరుగుతుంది అన్న ఉత్కంఠ నెలకొంది.

ALSO READ: War: గల్ఫ్‌లోని టెక్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్

RELATED ARTICLES

Most Popular