Supreme court vs NCERT: దేశ విద్యా వ్యవస్థలో సంచలనం రేపిన పరిణామంగా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) రూపొందించిన 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయ వ్యవస్థలో అవినీతి అంశాన్ని ఒక పూర్తి అధ్యాయంగా చేర్చడం న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నమే అని సీజేఐ జస్టిస్ సూర్యాకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని స్వయంగా స్వీకరించి విచారణ ప్రారంభించిన ధర్మాసనం, పాఠ్యాంశం రూపకల్పన వెనుక ఉద్దేశ్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతినేలా చేసే చర్యలను సహించబోమని స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థపై కాల్పులు జరిపినట్లుగా ఈ చర్య కనిపిస్తోందని, దీని వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట రక్తమోడుతున్నట్టుగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. యువత మనసుల్లో న్యాయవ్యవస్థ పవిత్రతను కించపరచేలా పాఠ్యాంశం రూపొందించబడిందని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి విస్తృతంగా ప్రస్తావిస్తూ, కోర్టుల చరిత్ర, ప్రజాస్వామ్య పరిరక్షణలో వాటి పాత్ర వంటి అంశాలను మాత్రం విస్మరించడాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. జవాబుదారీతనం నిర్ధారించే వరకు ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ధర్మాసనం 5 కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద పాఠ్యాంశం ఉన్న 8వ తరగతి పుస్తకానికి సంబంధించిన అన్ని హార్డ్ కాపీలు, డిజిటల్ సంచికలను తక్షణమే మార్కెట్ నుండి, పాఠశాలల నుండి, ఆన్లైన్ వేదికల నుండి తొలగించాలని ఆదేశించింది. ఇప్పటికే పంపిణీ అయిన పుస్తకాలను స్వాధీనం చేసుకుని నివేదిక సమర్పించాలని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌కు స్పష్టం చేసింది. ఎక్కడైనా ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నా ఉపాధ్యాయులు వాటిని బోధనలో ఉపయోగించకూడదని, భౌతిక లేదా డిజిటల్ రూపంలో ప్రచారం చేయరాదని పేర్కొంది. పుస్తక ముద్రణ, పంపిణీ పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. అదేవిధంగా ఆ వివాదాస్పద అధ్యాయాన్ని రూపొందించిన నేషనల్ సిలబీ బోర్డ్ సభ్యుల వివరాలు, వారి అర్హతలు, ఆ అధ్యాయం ఆమోదించిన సమావేశపు చర్చా పత్రాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.
ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, ఎన్సీఈఆర్టీ చైర్మన్‌కు నోటీసులు జారీ చేస్తూ, బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయిదా వేసింది. విచారణ సమయంలో ఎన్సీఈఆర్టీ తరఫున క్షమాపణలు తెలుపుతూ, కారణమైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని సొలిసిటర్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ పరిణామం విద్యా వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య సంబంధాలపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ALSO READ: Ather Rizta: మధ్యతరగతి మనసు దోచుకుంటున్న స్కూటర్.. అమ్మకాలు చూస్తుంటే ఆశ్చర్యమే!

