HomeUncategorizedShubalagnam Scene: రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య!

Shubalagnam Scene: రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య!

📰 Generate e-Paper Clip

Shubalagnam Scene: డబ్బు కోసం భర్తను భార్య వదులుకోవడం అన్నది ఇప్పటివరకు వెండితెర కథలకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు అదే తరహా సంఘటన నిజ జీవితంలో జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అచ్చం శుభలగ్నం సినిమాలో చూపిన కథను తలపించేలా ఓ భార్య తన భర్తను మరో మహిళకు అప్పగించేందుకు సిద్ధపడింది. ఈ షాకింగ్ ఘటన భోపాల్ నగరంలో చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహ బంధాన్ని డబ్బుతో కొలిచిన ఈ వ్యవహారం సామాజిక విలువలపై తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

ఈ సంఘటనకు కేంద్రబిందువైన వ్యక్తి భోపాల్‌కు చెందిన 42 ఏళ్ల పురుషుడు. అతనికి తన కార్యాలయంలో పనిచేసే 52 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇంట్లో భార్య, ఇద్దరు కుమార్తెలతో అతడు దూరంగా ఉండడం ప్రారంభించాడు. కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, తరచూ గొడవలు జరగడం వల్ల పరిస్థితి తీవ్రతరమైంది. చివరికి భార్య కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇరుపక్షాలను కలిపేందుకు కోర్టు అధికారులు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా.. భర్త మాత్రం భార్యతో కలిసి జీవించేందుకు నిరాకరించాడు. తాను ప్రియురాలితోనే జీవిస్తానని కోర్టు ఎదుట స్పష్టంగా చెప్పడం వివాదానికి మరింత మంటపెట్టింది.

భర్త మొండితనాన్ని గమనించిన భార్య.. తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. భర్తను పూర్తిగా వదులుకోవడానికి సిద్ధమని చెబుతూ, అందుకు భారీ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. మొత్తం రూ.1.5 కోట్ల విలువైన ఆస్తులు కావాలని, అందులో భాగంగా ప్రియురాలికి చెందిన ఒక డూప్లెక్స్ ఇల్లు, అదనంగా రూ.27 లక్షల నగదు ఇవ్వాలని షరతు విధించింది. సాధారణంగా ఇలాంటి డిమాండ్లు వివాదాలకు దారి తీస్తాయి. కానీ ఈ కేసులో అనూహ్యంగా ప్రియురాలు వెంటనే అంగీకరించింది. తన వద్ద ఉన్న ఆస్తులను ఇవ్వడానికి సిద్ధపడుతూ, ప్రియుడిని పొందేందుకు ఎలాంటి వెనకడుగు వేయలేదు.

కోర్టు సమక్షంలోనే ఈ ఒప్పందం పూర్తవడం ఈ కేసును మరింత సంచలనంగా మార్చింది. ఒప్పందం ప్రకారం భార్య తన పిల్లలతో కలిసి కొత్త ఇంటికి మారిపోయింది. భర్త తన ప్రియురాలితో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు వెళ్లిపోయాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. వివాహ బంధం, కుటుంబ విలువలు, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలపై సమాజం మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఈ ఘటన కల్పించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Piyush Goyal: 2027 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

RELATED ARTICLES

Most Popular