Protocol Controversy: 77వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా జాతీయ పండుగను ఘనంగా నిర్వహిస్తూ దేశమంతా పండుగ వాతావరణంతో నిండిపోయింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలు దేశభక్తితో ఉప్పొంగిపోయాయి. సైన్యం, వైమానిక దళం, నౌకాదళం శక్తిసామర్థ్యాలను చాటుతూ నిర్వహించిన కవాతు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కవాతును పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్య అతిథులు, సైనిక ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే శకట ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అయితే ఈ వేడుకలు ముగిసిన వెంటనే ఒక వివాదం దుమారం రేపింది. రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రోటోకాల్ పాటించలేదంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు మూడో వరుసలో సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రతిపక్ష నేత హోదా ఉన్న వ్యక్తికి ఈ విధమైన సీటింగ్ ఇవ్వడం అనేది కావాలని చేసిన అవమానమేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రిపబ్లిక్ డే వంటి అత్యంత ప్రాధాన్యమైన జాతీయ పండుగ రోజున ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని వారు అంటున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడికి మరింత గౌరవప్రదమైన స్థానం ఉండాల్సిందని కాంగ్రెస్ వాదిస్తోంది.
ఈ అంశం సోషల్ మీడియాకు ఎక్కడంతో వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. ‘దేశ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి గౌరవం లేదా?’ అంటూ కాంగ్రెస్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రమంత్రులకు ఇచ్చే గౌరవం కూడా దేశ ప్రతిపక్ష నేతకు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. జాతీయ పండుగ వేదికగా రాజకీయ విభేదాలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.
ALSO READ: Ponguleti Srinivasa Reddy: వర్ధన్నపేటలో రూ.294 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Last Updated on January 27, 2026 · 4:09 AM by Star Trinethram



