Crime: హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలను మోసం చేసి, ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే… ఈ నెల 20న అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు బాలికలు బడిలో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇదే సమయంలో మాణిక్యేశ్వరనగర్‌కు చెందిన గండికోట్ మధు (19), జీహెచ్ఎంసీలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తూ వారిని పరిచయం చేసుకున్నాడు. మధు స్నేహితులు వారాసిగూడకు చెందిన గడ్డం వంశీ అరవింద్ (22), అలాగే మల్లేశ్వర్‌నగర్‌కు చెందిన ఈసం నీరజ్ (21) కూడా కలిశారు. మొదట వీరందరూ కలిసి హోటల్‌లో భోజనం చేశారు. ఆ తర్వాత బాలికలకు నమ్మకం కలిగేలా మాట్లాడుతూ, సరదాగా బయటికి వెళ్లమని ఒప్పించి, వారిని బస్సులో యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు.
అక్కడ లాడ్జ్‌లో మూడు వేర్వేరు గదులు తీసుకుని, అక్కడే బాలికలపై దారుణానికి ఒడిగట్టారు. మరుసటి రోజు సాయంత్రం వారిని తిరిగి తార్నాక వద్ద వదిలేశారు. ప్రారంభంలో భయంతో ఈ విషయం బయట పెట్టని బాలికలు, చివరకు ధైర్యం చేసి తల్లిదండ్రులకు జరిగిన సంగతిని తెలియజేశారు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితులను భరోసా సెంటర్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దీనితో పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు, గది అద్దెకు ఇచ్చిన లాడ్జ్ యజమాని సోమేశ్‌ను కూడా అరెస్టు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.


