Teacher Cruelty: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎక్కువ బాధ్యత టీచర్‌దే. గురువు ఒక విద్యార్థి జీవితాన్ని సుసంపన్నంగా మార్చగలడు. కానీ అదే గురువు నిర్లక్ష్యం చేస్తే లేదా దారుణంగా ప్రవర్తిస్తే ఆ చిన్నారి మానసికంగా తీవ్రంగా దెబ్బతింటాడు. ఈ తరహా ఘటనలు చాలా సార్లు ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తుంటాయి. అయితే తాజాగా ఓ ప్రైవేట్ స్కూల్‌లోనూ అలాంటి షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ గౌతమపురి కాలనీలో ఉన్న మోడల్ సిటీ హైస్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న మహమ్మద్ రియాజ్ ఖాన్ అనే చిన్నారి క్లాస్‌లో ఉండగా, టీచర్ తబుస్సుమ్ బేగం అతనిని నోట్‌బుక్ తీసుకురావాలని కోరింది. అయితే రియాజ్ పొరపాటున మరో బుక్‌ను ఇచ్చాడు. చిన్నారి తప్పిదాన్ని సహజంగా సరిదిద్దాల్సిన టీచర్, ఆగ్రహానికి లోనై విద్యార్థిని తీవ్రంగా కొట్టింది.
వివరాల్లోకి వెళ్లితే.. తబుస్సుమ్ బేగం రియాజ్ వీపుపై దారుణంగా కొట్టి వాతలు పొంగేలా చేసింది. స్కూల్‌లోని మిగతా పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి భయపడిపోయారు. సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిన రియాజ్.. తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. బాలుడి వీపు గాయాలను చూసి తల్లిదండ్రులు షాక్‌కు గురై వెంటనే బోరబండ పోలీస్ స్టేషన్‌లో టీచర్‌పై ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటన వెలుగులోకి రాగానే స్థానికులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై ఇలాంటి హింస ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ పోలీసులు సదరు టీచర్‌పై చర్యలు తీసుకోకపోవడం విశేషమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పిల్లలపై హింసను నిరోధించే చట్టాలు దేశంలో అమలులో ఉన్నప్పటికీ, తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులను శారీరకంగా, మానసికంగా వేధించడం నేరం. అయినప్పటికీ కొన్ని పాఠశాలల్లో ఈ నియమాలను పట్టించుకోవడం లేదు.
ALSO READ: Iraivan: అమ్మాయిలను దారుణంగా చంపే స్మైలీ సైకో కిల్లర్ మూవీ
Teacher Cruelty: ఒకటో తరగతి విద్యార్థిపై టీచర్ దాడి!


