Andhra: విజయనగరం జిల్లాలో ఘోరమైన దారుణం వెలుగులోకి వచ్చింది. బొండపల్లి మండలం కొండకిండాంలోని 72 ఏళ్ల పెదమజ్జి నాయుడు బాబును తన కన్న కొడుకు గణేష్ దారుణంగా హత్య చేశాడు. ఆస్తి విషయంలో ఉద్రిక్తత కారణంగా ఈ ఘటన జరిగింది. కొన్ని రోజులుగా తండ్రి బాబు, కుమారుడు గణేష్ మధ్య భూమి, ఆస్తి సమస్యపై వివాదం సాగుతుండగా, గత పదిహేను రోజుల క్రితం ఒక ఘర్షణలో తండ్రికి కాలు విరిగిపోయి తీవ్ర గాయాలు అయ్యాయి.
తండ్రి తన అనారోగ్య చికిత్స కోసం కొంత డబ్బు అవసరం ఉందని, పెద్దమనుషుల ద్వారా కుమారుడికి సూచించగా, గణేష్ కోపంతో రగిలిపోయి తండ్రిని హతమార్చే నిర్ణయం తీసుకున్నాడు. గురువారం రాత్రి, అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటికి చేరిన గణేష్, ఇంట్లో ఉన్న గునపం ఉపయోగించి తండ్రి గుండెపై బలంగా కొట్టి, ముక్కు–నోరు మూసి ఊపిరాడకుండా చేసి కిరాతకంగా హతమార్చాడు. చిన్నతన నుండి ప్రేమతో పెంచిన తండ్రి అనే మమకారం కూడా లేకుండా మానవత్వాన్ని మరచి మృగంలా ప్రవర్తించాడు.
హత్య తర్వాత గణేష్ తండ్రి మరణాన్ని సహజ మరణంగా చూపించేందుకు ప్రయత్నించడమే కాక, కుటుంబ సభ్యులపై కూడా ఒత్తిడి చేసి వాస్తవాలను దాచాలనుకున్నాడు. అయితే, ఈ ఘటన గురించి గ్రామస్తులు గుర్తు తెలియని వ్యక్తి వలె పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు గణేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు, ఆయన కోసం పోలీసు శాఖ గాలింపు చర్యలు చేపట్టింది.


