Crime: హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ కుమారుడు తన తల్లిదండ్రులనే దారుణంగా హతమార్చాడు.
స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం – నేరేడ్ మెట్ లో నివసించే రాజయ్య (78), లక్ష్మి (65) దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు శ్రీనివాస్ (35) మద్యానికి బానిసయ్యాడు. తరచూ మద్యం మత్తులో తన భార్యతో గొడవపడేవాడు. చివరికి భార్య అతన్ని వదిలి వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు.
ఇటీవలి కాలంలో అతని మద్యం అలవాటు మరింత పెరిగింది. ఎన్నిసార్లు మానుకోవాలని చెప్పినా వినకపోవడంతో కుటుంబ సభ్యులు ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. కొద్ది రోజుల క్రితం అక్కడి నుంచి డిశ్చార్జి అయ్యాడు. పగలు చిన్నచిన్న పనులు చేసుకున్నప్పటికీ, సాయంత్రం మద్యం తాగడం అతని నిత్యకృత్యమైపోయింది.
ఆదివారం రాత్రి కూడా మద్యం తాగి ఇంటికొచ్చిన శ్రీనివాస్ తల్లిదండ్రులతో మాటా మాటా పెరగడంతో ఆగ్రహానికి లోనయ్యాడు. తల్లిదండ్రులు అడ్డుకోవడంతో నియంత్రణ కోల్పోయి, విచక్షణ మరచి కర్రతో ఇద్దరినీ బాదాడు. తీవ్రంగా గాయపడిన రాజయ్య, లక్ష్మి అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. నిందితుడైన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రుల్ని పోషించాల్సిన కొడుకు చేతుల మీదుగా వారే ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.


