Ande Sri: ప్రముఖ ప్రజాకవి, రచయిత అందెశ్రీ ఇక లేరు. 64 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అందెశ్రీ ఆదివారం రాత్రి లాలాగూడలోని తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమానికి తన స్ఫూర్తిదాయక గీతాలతో ఉత్సాహం నింపిన అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ” పాటను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గీతంగా గుర్తించింది.
1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో (ప్రస్తుత సిద్దిపేట జిల్లా) జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లన్న. భవన నిర్మాణ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయనకు పాఠశాల విద్య లేకపోయినా, తన కవితా ప్రతిభతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. “మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు” అనే పాటతో ఆయనకు విశేష గుర్తింపు లభించింది. అశువు కవిత్వంలో దిట్టగా పేరుపొందిన అందెశ్రీ ప్రజాకవి, ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచించిన గీతాలు ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపాయి.
కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన అందెశ్రీ 2006లో గంగ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్‌నాయక్ పురస్కారం వంటి అనేక గౌరవాలు అందుకున్నారు. ఆయన మరణంతో తెలుగు సాహిత్యలోకం అమూల్యమైన కవిని కోల్పోయింది.
ALSO READ: Viral Video: పెళ్లి వేడుకలో పుష్ అప్స్ పోటీ.. యువకుడిని మట్టికరిపించిన యువతి
Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత


