Cinema: అగ్ర హీరోల సినిమా విడుదల రోజున థియేటర్ల వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా డైలాగ్స్, నేపథ్య సంగీతం కంటే అభిమానుల కేరింతలు, ఈలలు, చప్పట్లు, డ్యాన్స్‌లతో పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఈసారి ‘ఓజీ’ ప్రదర్శనలో ఆ ఉత్సాహం మరింత రెట్టింపు అయిందని ప్రసాద్ మల్టీప్లెక్స్ వెల్లడించింది. కొంతమంది అభిమానులు ఆనందంతో టీ షర్ట్లు చింపుకోవడంతో, ఇకపై సినిమా చూసేందుకు వస్తే అదనంగా ఓ టీ షర్ట్ తెచ్చుకోవాలని మల్టీప్లెక్స్ యాజమాన్యం చమత్కరంగా సూచించింది. దుస్తుల బాధ్యత తమపై ఉండదని స్పష్టం చేస్తూనే, మరపురాని అనుభూతి పంచుతామని హామీ ఇచ్చింది.
పవన్ కల్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజీ’ గురువారం విడుదలై అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. పవన్ లుక్స్, మ్యానరిజం, సుజీత్ స్టైలిష్ మేకింగ్, తమన్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత డీవీవీ దానయ్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మొదటగా ‘ఓజీ’ టైటిల్‌ను నిర్మాత నాగవంశీ రిజిస్టర్ చేయించారని, తమ అభ్యర్థనపై సంతోషంగా ఇచ్చారని దానయ్య తెలిపారు. పవన్ అభిమానిగా ఆయనతో సినిమా చేయడం, అది విడుదలై విజయం సాధించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని సుజీత్ చెప్పారు.


