Andhra: ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పు కోసం ఓ గర్భిణీ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆ సమయంలో అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆమె నేరుగా వాష్‌రూమ్‌కి వెళ్లి ప్రసవించింది. మగ శిశువుకు జన్మనిచ్చిన ఆ తల్లి, బిడ్డను బాత్రూమ్ బకెట్లో వదిలేసి వెళ్లిపోయింది.
శిశువు ఏడుపు విని ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై తలుపు తెరిచారు. లోపల పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే శిశువును బయటకు తీసి సంరక్షించి, వైద్యులు లేకపోవడంతో మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించగా, ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు.
ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో గర్భిణి మరో వ్యక్తితో కలిసి ఆస్పత్రికి వచ్చిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఆధారంగా పోలీసులు ఆమెను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీఐ సురేష్ తెలిపిన ప్రకారం, శిశువు ప్రాణాపాయం నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉన్నాడు. శిశు సంరక్షణ కోసం ఐసిడిఎస్ అధికారులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తల్లిని గుర్తించి పట్టుకునే చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.


