జాగృతి జనం బాటతో ప్రజల్లోకి కవిత
ప్రభుత్వ నిర్లక్ష్యంపై కవిత మండిపాటు
జూబ్లీహిల్స్ ఎన్నికలపై కాదు, రైతు జీవితాలపై దృష్టి పెట్టండి
: జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత
Kavitha Kalvakuntla: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాదయాత్ర కార్యక్రమం ‘జాగృతి జనం బాట’ మంగళవారం ఘనంగా కొనసాగుతోంది. సామాజిక తెలంగాణ సాధనయే తమ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన కవిత.. 33 జిల్లాల్లో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడమే జాగృతి కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ప్రజల సమస్యలను మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
ఎక్కడికి వెళ్లినా ప్రజలు సమస్యలు స్వాగతం పలుకుతున్నారని, వాటిలో నాలుగు సమస్యలు పరిష్కారం అయినా తమ పుట్టుక ధన్యమని కవిత భావోద్వేగంగా అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయని, అయితే ఇంకా పరిష్కారం కానివి చాలా ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. ప్రజలతో మమేకమై నాలుగు నెలల పాటు ఫీల్డ్‌లో పనిచేసిన తర్వాత భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
పత్తి రైతుల పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కవిత.. మొంథా తుఫాన్ ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పత్తి తేమ శాతం పెంచి కొనుగోలు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల మీద చూపుతున్న శ్రద్ధ రైతుల మీద ఎందుకు చూపడం లేదని ఆమె ప్రశ్నించారు. రైతును విస్మరిస్తే రాజ్యం బాగుండదని హెచ్చరించారు.
బోనస్, రైతు భరోసా, యూరియా సరఫరా, కరెంట్ కోతల వంటి సమస్యలపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేస్తూ, రైతుల సమస్యలను కేంద్రంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. సీసీఐ చైర్మన్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌లతో మాట్లాడి పత్తి రైతులకు మేలు చేసే దిశగా కృషి చేస్తానన్నారు.
చనాఖా-కొరటా, కుప్తి, సిరిచెలిమ ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చనాఖా-కొరటా ప్రాజెక్ట్ వ్యయం మూడువందల కోట్ల నుండి రెండు వేల కోట్లకు పెరగడం వెనుక కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. మహారాష్ట్రలో భూ సేకరణ పూర్తికాక ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని, మరో 10 శాతం పనులు పూర్తయ్యాక 50 వేల ఎకరాలకు నీళ్లు అందుతాయని వివరించారు.
ఆదిలాబాద్‌లోని కొమురం భీమ్ కాలనీలో ఆదివాసీల భూముల సమస్యను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దలకు ప్రభుత్వ భూములు కేటాయిస్తే పేద ఆదివాసీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో గవర్నర్ వద్దకు వెళ్లి పట్టాలు సాధిస్తామని తెలిపారు.
బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని జాగృతి శ్రేణులు పోరాటం చేస్తాయని కవిత ప్రకటించారు. బోథ్ ప్రాంతంలో వంద పడకల ఆస్పత్రి, వెల్ఫేర్ స్కూల్ భవనం వంటి మౌలిక సదుపాయాలు తక్షణం పూర్తి చేయాలని కోరారు. జైనత్ ఆలయ అభివృద్ధి కోసం ఎంపీ నగేష్ రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, తానూ సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయితీల్లో మౌలిక వసతులు పెంచాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఐటీ టవర్ పూర్తి చేసి కంపెనీలు రావటానికి మంత్రి శ్రీధర్ బాబు కృషి చేయాలని సూచించారు. టౌన్ మధ్యలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం వలన ప్రజలు ఇళ్లు కోల్పోతారని, ఊరు బయట ప్రభుత్వ భూమిలోనే నిర్మాణం జరగాలని సలహా ఇచ్చారు.
రైల్వే లైన్లు, అండర్ బ్రిడ్జ్‌లు, ఓవర్ బ్రిడ్జ్‌ల పనులు వేగంగా పూర్తి చేయాలని ఆమె సూచించారు. విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వకపోవడం పట్ల ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రైవేట్ కాలేజీల బంద్‌కు మద్దతు తెలుపుతూ, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
పేదలకు విద్య, మహిళలకు సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కవిత పిలుపునిచ్చారు. మందులు, ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. తలమడుగు మండలంలో పత్తి రైతు ఆత్మహత్యపై విచారం వ్యక్తం చేస్తూ, రైతు ఆత్మహత్యలు ఆగాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. జాగృతిని మరింత బలోపేతం చేస్తామని, ప్రజల సమస్యలను తీర్చే దిశగా ముందుకు సాగుతామని కవిత స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధనే తమ లక్ష్యమని, జాగృతి అజెండా నచ్చిన వారికి, నచ్చని వారికీ స్వాగతం అని ప్రకటించారు.
ALSO READ: Viral news: ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి రూ.11 లక్షల మాయం
Kavitha Kalvakuntla: రైతులే తెలంగాణకు బలం


