Kantara: కాంతార చాప్టర్-1: ప్రీమియర్ షోలు రద్దు

cinema

Kantara: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కాంతార చాప్టర్-1 ఈ దసరా కానుకగా గురువారం వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన కాంతార మొదటి భాగానికి ప్రీక్వెల్‌గా వస్తోంది. అందుకే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రిషబ్ శెట్టి ప్రమోషన్స్‌ను కూడా జోరుగా కొనసాగించాడు.

సినిమా హైప్ దృష్ట్యా, నిర్మాతలు అసలు రిలీజ్ డేట్ కంటే ఒక రోజు ముందుగానే పైడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. బుకింగ్స్ కూడా ఓపెన్ చేసి, టికెట్లు వేగంగా అమ్ముడుపోయాయి. అయితే అనూహ్యంగా అన్ని ప్రీమియర్ షోలను రద్దు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు ప్రీమియర్స్ ఉంటాయని ముందుగా ప్రకటించినా, చివరి నిమిషంలో వాటిని రద్దు చేయడం అభిమానులను నిరాశపరిచింది. అయితే దీనికి గల కారణాలు స్పష్టంగా బయటకు రాలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ తెలంగాణలో మాత్రం నైజాం ప్రాంతంలో టికెట్ ధరల హైక్‌ను తిరస్కరించారు. అందువల్ల అక్కడ సాధారణ రేట్లకే సినిమా రిలీజ్ కానుంది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి. ముఖ్యంగా ఐమాక్స్ స్క్రీన్లకు కంటెంట్ డిలే కావడం వల్ల ఎర్లీ ప్రీమియర్స్ రద్దు చేయాల్సి వచ్చిందని సమాచారం.

ఏదేమైనా, భారీ అంచనాల నడుమ వస్తున్న కాంతార చాప్టర్-1 ప్రీమియర్ షోలు రద్దు కావడంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొన్నప్పటికీ, రిలీజ్ రోజు థియేటర్లలో రికార్డు స్థాయిలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: ibomma: త్వరలోనే ఐబొమ్మ హెడ్ ను పట్టుకుంటాం: పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్

Kantara: కాంతార చాప్టర్-1: ప్రీమియర్ షోలు రద్దు