Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆమె పలు విషయాలను వెల్లడించారు.
“కాంగ్రెస్ నాయకులు ఎవరూ నన్ను సంప్రదించలేదు. కానీ సీఎం ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు, బహుశా భయపడుతున్నారేమో. కాళేశ్వరం అంశం తప్ప హరీశ్ రావుపై నాకు ఎలాంటి కోపం లేదు. 2016లోనే కేటీఆర్‌కు ఇరిగేషన్‌పై సూచనలు ఇచ్చాను. అప్పటికే సీఎంకు ఫైళ్లు నేరుగా వెళ్లుతున్నాయని ఆయనకు చెప్పాను. కిందిస్థాయి కమిటీ ఆమోదం లేకుండానే సీఎంకు ఫైళ్లు పంపబడుతున్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్నీ స్పష్టమవుతాయి. రాజకీయ పార్టీ స్థాపనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజకీయాల్లో ఎవరూ స్థలం ఇవ్వరు, మనమే కృషి చేసి ముందుకు సాగాలి” అని తెలిపారు.
ఆల్మట్టి ఆనకట్టపై మాట్లాడుతూ – “సుప్రీంకోర్టు స్టే ఉన్నా కర్ణాటక ఎత్తు పెంచేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. ప్రభుత్వం ముందుకు రాకపోతే, జాగృతి తరఫున మేమే కోర్టును ఆశ్రయిస్తాం. మహారాష్ట్ర ఇప్పటికే స్పందించింది. ఆల్మట్టి ఎత్తు పెరిగితే కృష్ణా నదిలో నీరు కాకుండా క్రికెట్ ఆడుకోవాల్సిందే. పదేళ్లలో ఆర్డీఎస్, తుమ్మిళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి కాలేకపోయాయి. సీఎం రేవంత్‌రెడ్డి కూడా కృష్ణా ట్రైబ్యునల్ విచారణకు హాజరవ్వాలి” అని సూచించారు.
అలాగే – “నా మీద బీఆర్‌ఎస్, హరీశ్ రావు, సంతోష్ సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారు. కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరసనలు చేపడతాం. ఎమ్మెల్సీ పదవికి ఇప్పటికే రాజీనామా చేసాను, మండలి ఛైర్మన్ ఆమోదించాలని కోరాను. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తే అది మంచిదే, స్వాగతించాలి. ఆదివారం చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకల్లో నేను పాల్గొంటాను” అని కవిత స్పష్టం చేశారు.


