తరుణం బ్రిడ్జి సమస్యను ఎత్తిచూపిన కవిత
భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా స్తంభించిన రవాణా
గతంలో లారీలు కొట్టుకుపోయిన ఘటనలను గుర్తుచేసిన కవిత
: జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత
స్టార్ త్రినేత్రం, ఆదిలాబాద్: జాగృతి జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లా జైనాథ్, బేల మండలాల మధ్య ఉన్న తరుణం బ్రిడ్జి ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యలను స్వయంగా పరిశీలించారు. తరుణం బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో రెండు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
“మనం ప్రస్తుతం బేల, జైనాథ్ మండలాల మధ్య ఉన్నాం. ఇక్కడ బ్రిడ్జి కోసం ప్రజలు ఏళ్ల తరబడి పోరాడితే గానీ రూ.4 కోట్లతో చిన్న బ్రిడ్జి కట్టారు. కానీ ముందుగా రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక బ్రిడ్జి కట్టాలి గానీ, ఇక్కడ మాత్రం అటు ఇటు రోడ్లు వేసి చిన్న బ్రిడ్జి కట్టేశారు. పాత బ్రిడ్జిని కూడా కూలగొట్టడంతో ఇప్పుడు టూవీలర్లు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది” అని కవిత తెలిపారు.
భారీ వర్షాలు, వరదల సమయంలో ఈ ప్రాంతం పూర్తిగా వేరుపడిపోతుందని, గతంలో లారీలు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. తరుణం బ్రిడ్జి పూర్తి కాకుంటే మహారాష్ట్రతో కనెక్టివిటీ కూడా పూర్తిగా కోల్పోతామని హెచ్చరించారు.
“ఈ రెండు మండలాల్లోని వందలాది గ్రామాల ప్రజలు రవాణా సమస్యలతో సతమతమవుతున్నారు. ఇది కేవలం అభివృద్ధి అంశం కాదు, ప్రజల ప్రాణ భద్రతకు సంబంధించిన విషయం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని తరుణం బ్రిడ్జి పనులను పూర్తి చేయాలి. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ప్రజల కష్టాలను పట్టించుకుని ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రావాలి” అని కవిత అన్నారు.
జాగృతి కార్యకర్తలు కూడా ఈ సమస్యపై చురుకుగా పోరాటం కొనసాగిస్తారని కవిత ప్రకటించారు. “తరుణం బ్రిడ్జి పూర్తయ్యే వరకు మేము నిశ్చలంగా ఉండం. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే వరకు జాగృతి స్వరం ఆగదు” అని ఆమె స్పష్టం చేశారు.
ALSO READ: Kalvakuntla Kavitha: పత్తి రైతులకు న్యాయం చేయాలి
Kalvakuntla Kavitha: తరుణం బ్రిడ్జి పూర్తయ్యే వరకు జాగృతి పోరాటం


