BJP: జనహిత యాత్ర డ్రామా: గంట రవికుమార్, కొండేటి శ్రీధర్

Telangana

* స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రభుత్వం కొత్త డ్రామా
* అభివృద్ధి కార్యక్రమాలు లేకుండానే జనహిత ఎందుకోసం
* రాజకీయాల కోసమే టూరిస్ట్ మంత్రులు
* బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ ఆగ్రహం

స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: ఎన్నికలవేళ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు జనహిత కార్యక్రమం పేరుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించడం విడ్డూరంగా ఉందని వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వరంగల్ రెండో రాజధాని అంటూనే కనీసం నిధులు విడుదల చేయకుండా ప్రజల్ని మాయ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం సాధించారని మంత్రులు వరంగల్ జిల్లాలో జనహిత కార్యక్రమం చేపట్టారని నిలదీశారు. రానున్న ఎన్నికల్లో ఓట్ల రాజకీయాల కోసం కొత్త డ్రామాకు సీఎం రేవంత్ రెడ్డి తెరతీశారని విమర్శించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో చేపట్టిన ఈ కార్యక్రమం కనీసం ఆ నియోజకవర్గానికి ఒక్క పైసా అన్న అభివృద్ధి కోసం ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. కేవలం ప్రజల్ని మాయ చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మరో మోసానికి పాటుపడుతోందని గంట రవికుమార్ మండిపడ్డారు.

వరంగల్‌కు ఒక్క పైసా ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వరంగల్‌కు కనీసం బస్టాండ్‌ను కూడా నిర్మించలేని దౌర్భాగ్య స్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని గంట రవికుమార్ ఆరోపించారు. ఇక్కడి జిల్లా మంత్రులు నిధులు తేవడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్ అంటూ హల్‌చల్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు బుద్ధి చెప్పేందుకు ఓరుగల్లు ప్రజలు సిద్ధమయ్యారని, జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని రవికుమార్ పేర్కొన్నారు.

అనంతరం బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు పదవుల దుర్వినియోగం చేస్తూ కేవలం వాగ్దాటిలో మాత్రమే మునిగిపోయారని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల రాజీనామాలను స్వీకరించి, ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని కొండేటి శ్రీధర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వంటి నేతలు ఒకే విధమైన రాజకీయ నాటకాలు ఆడుతూ సమాజంలో అపోహలు కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

బీజేపీపై తప్పుడు ఆరోపణలు మోపడం సరికాదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన తమ పార్టీకి సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఎంపీ స్థానాలు పెరిగాయని, ఇకపై తెలంగాణలో కాంగ్రెస్‌కు స్థానం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి బీసీ వర్గాలపై కపటప్రేమ చూపిస్తున్నదని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అన్నీ ప్రజలను మోసం చేయడానికే అని, నిజమైన ధైర్యం ఉంటే తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని సవాల్ విసిరారు. బండి సంజయ్‌పై విమర్శలు చేసే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానేసి.. ప్రజలకు సమాధానం చెప్పాలని కొండేటి శ్రీధర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా, రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి సత్యం, జిల్లా కార్యదర్శి జడ సతీష్, అధికార ప్రతినిధి మహేందర్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు, మాజీ మండల అధ్యక్షులు రాయపురపు కుమారస్వామి, జిల్లా కౌన్సిల్ మెంబర్ మైస రాము, సీనియర్ నాయకులు బోయినపల్లి దేవేందర్ రావు, మాజీ పట్టణ అధ్యక్షులు పెద్దూరి రాజ్‌కుమార్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సోమిరెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఎల్బకంటి గిరి ప్రసాద్, శక్తి కేంద్రం ఇన్చార్జి మల్లెపాక అనిల్, బూత్ అధ్యక్షులు ఆంగోతు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: Viral News: నేలపై వెళ్తున్న పురుగును నోట్లో వేసుకున్న చిన్నారి

BJP: జనహిత యాత్ర డ్రామా: గంట రవికుమార్, కొండేటి శ్రీధర్