Interesting fact: మన భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో “తీర్థం” మరియు “క్షేత్రం” అనే పదాలు తరచుగా వినిపిస్తాయి. చాలా మంది ఈ రెండు పదాలను ఒకటిగా భావించి ఉపయోగిస్తారు. కానీ వాస్తవానికి ఇవి రెండు వేర్వేరు అర్ధాలు కలిగిన పవిత్ర భావాలు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే వీటి వెనుక ఉన్న తత్త్వం ఎంతో లోతైనది. మన పూర్వికులు ప్రతి పదాన్ని సున్నితంగా అర్ధం చేసుకొని వాడేవారు. కానీ కాలక్రమంలో ఈ రెండు మధ్య తేడా మసకబారిపోయింది. ఆ భేదం ఏమిటో తెలుసుకోవడం ద్వారా మనం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల గొప్పతనాన్ని మరింతగా అర్థం చేసుకోగలం.
తీర్థం అనే పదం “తరింపజేసేది” అనే అర్ధంలో వస్తుంది. అంటే పాపాలను తొలగించి, భక్తుని ఆత్మను పవిత్రం చేసే ప్రదేశం లేదా జలస్థానం. సాధారణంగా నదులు, సముద్రాలు, సరస్సులు లేదా వాటి తీరప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను తీర్థాలు అంటారు. నదీ జలాలు అక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయి. పవిత్ర గంగ, గోదావరి, కృష్ణా, తుంగభద్ర వంటి నదుల తీరాన వెలసిన వారణాసి, రామేశ్వరం, గోకర్ణ, హరిద్వార్, త్ర్యంబకేశ్వర్ వంటి ప్రదేశాలు తీర్థక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ తీర్థాలలో స్నానం చేయడం, దానం చేయడం, పూజలు నిర్వహించడం వల్ల పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇక “క్షేత్రం” అనే పదానికి అర్ధం కొంత భిన్నం. నదీ తీరాలు, జలప్రదేశాలు లేని ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను క్షేత్రాలు అంటారు. “క్షేత్రం” అంటే భూమి లేదా స్థలం అనే అర్ధం. భూమిపై దైవం నివాసం ఏర్పరుచుకున్న ప్రదేశం క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఈ క్షేత్రాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. స్థల క్షేత్రాలు మరియు గిరి క్షేత్రాలు. నేలమట్టంలో ఉన్న ఆలయాలను స్థల క్షేత్రాలు అంటారు. అహోబిలం నరసింహ స్వామి ఆలయం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, బాసర సరస్వతీ దేవాలయం, ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం వంటి ప్రదేశాలు స్థల క్షేత్రాలుగా పరిగణించబడతాయి.
కొండలపై, పర్వత ప్రాంతాల్లో వెలసిన ఆలయాలను గిరి క్షేత్రాలు అంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, సింహాచలం నరసింహ స్వామి ఆలయం, మంగళగిరి పానకల నరసింహ స్వామి ఆలయం మొదలైనవి గిరి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గిరి క్షేత్రాలు ఆధ్యాత్మిక శక్తితో నిండిన ప్రదేశాలుగా భావించబడతాయి. కొండపైకి ఎక్కి భగవంతుడిని దర్శించడం అనేది మనలోని అహంకారాన్ని దహనం చేయడం, విశ్వాసాన్ని పెంపొందించడం అనే తత్త్వాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొన్నిసార్లు నది పక్కనే ఉన్నా కూడా దేవాలయం కొండపై ఉంటే దానిని తీర్థం కాకుండా క్షేత్రంగా పరిగణిస్తారు. ఉదాహరణకు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఇది కృష్ణా నది తీరంలో ఉన్నప్పటికీ, ఇందిరకీలాద్రి పర్వతంపై ఉన్నందున క్షేత్రంగా పిలుస్తారు. అంటే దేవాలయం ఎక్కడ వెలసిందన్నది, ఆ ప్రదేశానికి సంబంధించిన శక్తి ఎలా ఉందన్నది దాని నిర్వచనాన్ని నిర్ణయిస్తుంది.
తీర్థాలు మనలోని అపవిత్రతను జలస్పర్శ ద్వారా తొలగిస్తాయి. క్షేత్రాలు మాత్రం మన మనసును, ఆత్మను శుద్ధి చేస్తాయి. తీర్థం భౌతిక పవిత్రతకు సూచకం అయితే, క్షేత్రం ఆధ్యాత్మిక పవిత్రతకు ప్రతీక. ఈ రెండూ భక్తుడిని మోక్ష మార్గంలో నడిపించే శక్తులు. అందుకే మన పూర్వులు తీర్థయాత్రలు చేస్తూనే క్షేత్ర దర్శనాలు కూడా చేసేవారు. నీటి పవిత్రతతో పాటు భూమి శక్తిని కూడా అనుభవించాలని ఉద్దేశం.
మొత్తానికి తీర్థం, క్షేత్రం రెండూ మన హిందూ ఆధ్యాత్మిక జీవన విధానంలో అవిభాజ్య భాగాలు. తీర్థం మన శరీరాన్ని పవిత్రం చేస్తే, క్షేత్రం మన చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. ఈ రెండింటి సందర్శనం ద్వారా భక్తుడు భౌతిక పాపాల నుండి విముక్తి పొంది, దైవానుభూతిని పొందుతాడు.
ఇక మీదట మనం ఏ దేవాలయానికైనా వెళ్లినప్పుడు అది తీర్థమా క్షేత్రమా అని తెలుసుకొని, దానికి తగ్గ ప్రాధాన్యంతో భక్తి భావంతో దర్శనం చేయడం మన సంస్కృతికి గౌరవం చూపినట్టవుతుంది.
ALSO READ: Diwali 2025: ఈ 5 రాశుల వారు దీపావళి నుంచి డబ్బు, ఆనందం చూస్తారట?


