Talent: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖీరీ జిల్లా నివాసి మనీశ్ ధమేజా సాధారణ మనిషి కాదు. సాధారణంగా మనం క్రెడిట్ కార్డులను షాపింగ్, బిల్లులు చెల్లించుకోవడం లేదా చిన్న ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తాం. కానీ మనీశ్ ధమేజా మాత్రం ఈ కార్డులను ఒక విభిన్న కోణంలో చూసి ప్రపంచ రికార్డు స్థాయికి చేర్చుకున్నారు. ఆయన ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే, క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎయిర్‌మైల్స్‌లతో తన అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ తెలివైన ఆలోచనతోనే ఆయన 2021 ఏప్రిల్ 30న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. అప్పటికి ఆయన వద్ద చెల్లుబాటు అయ్యే 1,638 క్రెడిట్ కార్డులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1,700 దాటింది.
మనీశ్ ధమేజా వద్ద ఉన్న కార్డుల్లో చాలా వరకు జీవితాంతం ఉచితంగా వాడుకునే విధంగా ఉంటాయి. ఆయన వాటి ద్వారా వచ్చే పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లను ఉపయోగించి విమానాలు, రైళ్లు, హోటళ్లు, స్పాలు, గోల్ఫ్ ఆటల వరకు ఉచితంగా వినియోగిస్తున్నారు. ఎక్కడా అప్పు చేయకుండా, ఎక్కడా బాకీలు లేకుండా ఈ సదుపాయాలను పూర్తిగా తెలివిగా వినియోగించుకోవడం ఆయన ప్రత్యేకత. సాధారణ మనిషికి క్రెడిట్ కార్డు అంటే అప్పు చక్రం అనే భావన ఉంటే, మనీశ్ దృష్టిలో అది ఆదాయం సృష్టించే ఒక అవకాశమైంది.
క్రెడిట్ కార్డులతోనే కాదు, నాణేల సేకరణలో కూడా ఆయనకు విశేషమైన ఆసక్తి ఉంది. ఐదేళ్ల వయసులోనే నాణేలు సేకరించడం ప్రారంభించిన ఆయన వద్ద ప్రస్తుతం దాదాపు పది లక్షల నాణేలు ఉన్నాయి. వాటిలో అక్బర్ కాలం, మొఘల్ యుగం నుంచి ఆధునిక దేశాల నాణేల వరకు ఉన్నాయి. ఈ విస్తృతమైన నాణేల సేకరణకు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఆయన ఖాతాలో మరోసారి చేరింది.
వృత్తిరీత్యా టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న మనీశ్ ధమేజా, 2019 నుండి 2022 వరకు హైదరాబాద్‌లో కూడా నివసించారు. ప్రస్తుతం నాణేల చరిత్ర, మ్యూజియం నిర్వహణలో పీహెచ్‌డీ చేస్తున్నారు. భవిష్యత్తులో ఒక విశాలమైన నాణేల మ్యూజియాన్ని స్థాపించడం తన జీవిత లక్ష్యమని ఆయన చెబుతున్నారు.
ALSO READ: Journalist: ఈ జర్నలిస్టుకి ముద్దిస్తే పిల్లలు పుడతారట?.. ఎక్కడో తెలుసా?
Talent: క్రెడిట్ కార్డులతో జీవితం మార్చుకున్న భారతీయుడు


