ibomma: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా, ఓటీటీ పైరసీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవల థియేటర్లలో సినిమాలు రికార్డు చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్న పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (ibomma telugu movies) పై పోలీసులు దృష్టి సారించారు. అయితే వెబ్‌సైట్ నిర్వాహకులు సూటిగా పోలీసులకు సవాల్ విసరడంతో దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ సవాల్‌ను ఛాలెంజ్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ బృందం, ఆ వెబ్‌సైట్ కోసం పనిచేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుంది. దర్యాప్తులో భాగంగా బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఐబొమ్మకు ఏజెంట్లు ఉన్నట్లు కూడా బయటపడింది. మరోవైపు ఓటీటీ కంటెంట్‌ను తస్కరించడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం కలగడంతో, అధికారులు ఈ వెబ్‌సైట్‌పై విచారణను వేగవంతం చేశారు.
ఇక ఈ పరిణామాల మధ్య ఐబొమ్మ వెబ్‌సైట్ నుంచి తెలుగులో ఓ ప్రకటన వెలువడటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ప్రకటనలో, సినిమాలకు అనవసరంగా భారీ బడ్జెట్లు పెట్టి ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేసేందుకు ప్రేక్షకులపై భారం మోపుతున్నారని పేర్కొన్నారు. దీంతో సాధారణ ప్రేక్షకుడు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, థియేటర్లలో కెమెరాల సహాయంతో సినిమాలను రికార్డు చేసి ప్రింట్స్ విడుదల చేసే వెబ్‌సైట్లపైనే పోలీసులు దృష్టి పెట్టాలని సూచించారు. చివరగా “తాము ఏ దేశంలో ఉన్నా, భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కోసం ఆలోచిస్తాం” అని ప్రకటించడం గమనార్హం.


