Secret: ఏనుగులు అనగానే మనకు గుర్తుకొచ్చేది వాటి భారీ శరీరం, పెద్ద తొండం, పొడవైన దంతాలు. కానీ, వాటి అసలు శక్తి వాటి జ్ఞాపకశక్తిలో ఉంటుంది. ఏనుగులు జంతుజగత్తులో అత్యంత తెలివైనవిగా పేరుగాంచినవి. అవి మనుషుల్లా భావోద్వేగాలు కలిగి ఉంటాయి. స్నేహం అంటే అర్థం తెలిసిన జీవులు. పరిశోధనల్లో తేలిన వివరాల ప్రకారం.. ఏనుగులు దశాబ్దాల పాటు వందల మంది వ్యక్తులను, వలస మార్గాలను, గతంలో ఎదురైన అనుభవాలను గుర్తుంచుకోగలవు.
ఏనుగుల గుంపును సాధారణంగా పెద్ద ఆడ ఏనుగు నడిపిస్తుంది. దానిని మాతృమూర్తి అని పిలుస్తారు. ఈ మాతృమూర్తి ఒక లైబ్రరీ లాంటిది. ఎక్కడ నీరు దొరుకుతుందో, ఎక్కడ ఆహారం లభిస్తుందో, ఏ ప్రదేశం సురక్షితమో అన్న జ్ఞానం ఆమె జ్ఞాపకాలలో నిలిచిపోతుంది. కరువు వచ్చినప్పుడు, గుంపు ప్రాణాలను రక్షించే కీలక పాత్ర ఈ మాతృమూర్తిదే. పాత జ్ఞాపకాలను ఆధారంగా తీసుకొని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి గుంటలను గుర్తు చేసుకుంటుంది. ఆ జ్ఞానంతో మొత్తం గుంపును కాపాడుతుంది.
ఏనుగులు ప్రదేశాలే కాదు.. ముఖాలు, స్నేహాలు, భావోద్వేగాలు కూడా గుర్తుంచుకుంటాయి. సంవత్సరాల తర్వాత పాత స్నేహితులు కలిసినా అవి సంతోషంతో గొంతు పెంచి అరుస్తాయి. తొండాలతో ఒకటినొకటి పలకరించుకుంటాయి. ఏనుగులకు హాని చేసిన మానవుల ముఖాలు, దుస్తులు, వాసనలు కూడా గుర్తుంటాయి. ప్రమాదకర వ్యక్తులు కనబడితే వెంటనే జాగ్రత్త పడతాయి. అదే విధంగా, తమ కుటుంబసభ్యులు చనిపోయినప్పుడు వారి ఎముకలు లేదా దంతాలను చూసి మౌనంగా నిలబడుతాయి. ఆ క్షణాల్లో అవి చూపే బాధ మనసును కదిలిస్తుంది.
అయితే, ఈ జ్ఞానానికి పెద్ద ముప్పు వేటగాళ్లవలన వస్తుంది. పెద్ద దంతాలు కలిగిన మాతృమూర్తులను వేటగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటారు. ఒక మాతృమూర్తి చనిపోతే, ఆ మందతోపాటు దశాబ్దాల జ్ఞాపకాలు కూడా చెరిగిపోతాయి. నీటి గుంటలు ఎక్కడో, ఏ మార్గం సురక్షితమో, ఎక్కడ మాంసాహారులు తిరుగుతారో అన్న సమాచారం మొత్తం అంతరించిపోతుంది. ఫలితంగా చిన్న ఏనుగులు మార్గం తప్పిపోతాయి. నీరు కనుగొనడంలో విఫలమవుతాయి. కరువుతో లేదా ఆకలితో మరణిస్తాయి.
వేటాడటం అనేది కేవలం ఏనుగుల జీవితాలపై దాడి మాత్రమే కాదు.. వాటి జ్ఞాన వారసత్వాన్ని కూడా నాశనం చేయడం. ప్రతి మాతృమూర్తి తనతోపాటు శతాబ్దాలుగా సేకరించబడిన అనుభవాలను మోస్తుంది. ఆమె మరణంతో ఆ జ్ఞానం శాశ్వతంగా పోతుంది. అందుకే ఏనుగులను రక్షించడం అనేది ఒక జంతువు కాపాడడమే కాదు, ఒక జ్ఞాన సంప్రదాయాన్ని సంరక్షించడమే.
మనిషి తన జ్ఞానాన్ని పుస్తకాల్లో, కంప్యూటర్లలో భద్రపరుస్తాడు. కానీ ఏనుగులు తమ జ్ఞానాన్ని మనసులోనే భద్రపరుస్తాయి. వాటి జ్ఞాపకశక్తి ప్రకృతి ప్రసాదించిన అద్భుత శక్తి. ఈ శక్తి వాటి మనుగడకు మూలాధారం. కాబట్టి మనం ఏనుగులను కాపాడటం అంటే కేవలం ఒక జాతిని రక్షించడం కాదు, ప్రకృతి మనకు అందించిన మేధస్సు, జ్ఞాపకశక్తి, అనుభూతి అనే అద్భుత గుణాలను కాపాడడమే.
ALSO READ: Viral Video: పెళ్లి వేడుకలో పుష్ అప్స్ పోటీ.. యువకుడిని మట్టికరిపించిన యువతి
Secret: ఏనుగులు ఎన్నేళ్లైనా ఎలా గుర్తుంచుకుంటాయో తెలుసా..?


