Kidney stones: కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాలు తెలుసా?

Life Style

Kidney stones: మన శరీరంలో మూత్రపిండాలు లేదా కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. ఇవి రక్తంలోని వ్యర్థాలను వడకట్టి, అదనపు నీటిని మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని ఉప్పు, ఆమ్ల-క్షార (pH) స్థాయిలను సమతుల్యం చేస్తూ రక్తపోటును నియంత్రించడంలో, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కానీ, ఈ ముఖ్యమైన అవయవాల్లో రాళ్లు ఏర్పడితే ఆరోగ్యం తీవ్రమైన ప్రమాదంలో పడుతుంది. మూత్రపిండాల్లో పేరుకుపోయిన ఖనిజాలు కలసి ఘన స్ఫటికాలుగా మారి రాళ్లుగా ఏర్పడతాయి. మొదట ఇవి చిన్న గింజల్లాగా ఉండి కాలక్రమంలో పెద్ద రాళ్లుగా మారి మూత్రనాళాలను బ్లాక్ చేస్తాయి. ఈ రాళ్లు కదులుతూ ఉండగా నడుము, పక్కలు, పొత్తికడుపు వరకు తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి. మూత్ర విసర్జనలో మంట, రక్తం రావడం, మూత్రానికి దుర్వాసన, వికారం, జ్వరం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. పెద్ద రాళ్లు మూత్రనాళాన్ని పూర్తిగా మూసివేసి ఇన్ఫెక్షన్‌కు దారితీస్తాయి.

కిడ్నీ రాళ్లు సాధారణంగా నాలుగు రకాలుగా ఉంటాయి. కాల్షియం రాళ్లు, యూరిక్ యాసిడ్ రాళ్లు, స్ట్రువైట్ రాళ్లు, సిస్టీన్ రాళ్లు. ప్రతి రకానికి కారణాలు, ఆహారం, జీవక్రియ ప్రక్రియలు వేరువేరుగా ఉంటాయి. సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. భవిష్యత్తులో మరల రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది.

సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ నెఫ్రాలజీ నిపుణుడు డాక్టర్ హిమాన్షు వర్మ ప్రకారం.. కిడ్నీ రాళ్లకు ప్రధానంగా మూడు ప్రధాన కారణాలు ఉంటాయి. మొదటిది తగినంత నీరు తాగకపోవడం. శరీరంలో నీరు తక్కువగా ఉంటే మూత్రం చిక్కబడిపోతుంది. దీంతో ఖనిజాలు సులభంగా స్ఫటికాలుగా పేరుకుపోతాయి. రెండవ కారణం అధిక ఉప్పు ఉన్న ఆహారం. సోడియం స్థాయి పెరగడంతో కిడ్నీలు అదనపు కాల్షియంను బయటకు పంపుతాయి. దీని వలన కాల్షియం రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడవ కారణం జీవక్రియ ప్రక్రియలో గల లోపం. కొందరిలో శరీరం అధిక ఆక్సలేట్ లేదా యూరిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తుంది. ఇవి పేరుకుపోయి రాళ్లను ఏర్పరుస్తాయి.

ఇతర కారణాలు కూడా కావొచ్చు. ఉదాహరణకు కుటుంబ చరిత్ర, ఊబకాయం, ఎక్కువగా టీ లేదా కాఫీ తీసుకోవడం, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం, తక్కువ పొటాషియం, అధిక ప్రోటీన్ తీసుకోవడం, మధుమేహం, అధిక రక్తపోటు, మందుల దీర్ఘకాలిక వినియోగం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొన్ని అలవాట్లను పాటించడం అవసరం. ప్రతిరోజూ కనీసం 8-9 గ్లాసుల నీరు తాగడం మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తుంది. అధిక ఉప్పు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ను వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. ఆక్సలేట్ అధికంగా ఉన్న పాలకూర, బీట్‌రూట్, చాక్లెట్, బాదం వంటి పదార్థాలను మితంగా తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు మాత్రమే కాల్షియం సప్లిమెంట్స్ ఉపయోగించాలి. సమయానికి మూత్ర విసర్జన చేయడం, శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి రక్షించడం చాలా అవసరం. యూరిక్ యాసిడ్ లేదా ఖనిజ సమతుల్యతలో లోపం ఉంటే వైద్య పర్యవేక్షణలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.

సాధారణంగా చిన్న అలవాట్లే కిడ్నీలను రాళ్ల బారిన పడేలా చేస్తాయి. కాబట్టి నీరు తక్కువ తాగడం, ఉప్పు ఎక్కువగా తినడం, తీపి పదార్థాలపై ఆధారపడడం వంటి తప్పులు చేయకూడదు. కిడ్నీలు సరిగ్గా పనిచేయడం అంటే శరీరం ఆరోగ్యంగా ఉండటానికి పునాది. అందుకే ఈ అవయవాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి.

ALSO READ: Viral video: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రేమ జంట రొమాన్స్‌

Kidney stones: కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాలు తెలుసా?