Suprem Court: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు ఉండదని. అటువంటి సంతానాన్ని ఇంటి నుంచి వెళ్లగొట్టవచ్చని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. తల్లిదండ్రుల నిరాదరణకు గురయ్యే వృద్ధులకు 2007లో అమల్లోకి వచ్చిన “తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం” బలమైన అండగా నిలుస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ మధ్య మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ దంపతులు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. తమ కుమారుడు పోషణ బాధ్యతలు నిర్వర్తించడం లేదని, అలాగే తాము కష్టపడి సంపాదించిన ఆస్తిని రక్షించాలని కోరారు. ఇప్పటికే 2023లో ట్రైబ్యునల్‌ను ఆశ్రయించిన వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పులో కుమారుడు నెలకు రూ.3,000 ఇవ్వాలని, ముంబయిలోని వారి ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశించారు. కానీ ముంబయి హైకోర్టు ఆ తీర్పును తోసిపుచ్చి, 2007 చట్టం ప్రకారం ఆ కుమారుడే సీనియర్ సిటిజన్ కాబట్టి అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టే అధికారం ట్రైబ్యునల్‌కు లేదని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు అభిప్రాయాన్ని తప్పు పట్టి, ట్రైబ్యునల్ తీర్పును సమర్థించింది. నవంబర్ 30లోగా ఆ కుమారుడు ఇంటిని ఖాళీ చేయాలని గడువిచ్చింది.
గతంలో కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా తీర్పులు ఇచ్చింది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత కుమారులు, కుమార్తెలదేనని స్పష్టంచేసింది. ఆ బాధ్యతను విస్మరించిన వారికి తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉండదని తేల్చింది. ఉదాహరణకు, మధ్యప్రదేశ్‌కు చెందిన వృద్ధ దంపతులు తమ కుమారుడికి ఆస్తి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత అతడు వారిని పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం ఆ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి ఆస్తిపై వృద్ధుల హక్కును తిరిగి పునరుద్ధరించింది.
2007 చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన ట్రైబ్యునళ్లు ఇలాంటి కేసుల్లో త్వరితగతిన విచారణ జరిపి, తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తిరిగి బాధితులకు కట్టబెట్టే అధికారం కలిగి ఉంటాయని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.


