Caste Census: 74 ఏళ్ల తర్వాత దేశంలో కుల గణన.. ప్రయోజనాలివే

రాబోయే జనాభా లెక్కల్లో కుల గణనను చేర్చాలని మోదీ మంత్రివర్గం ఇటీవల ముఖ్యమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ చర్య సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ప్రోత్సహించడం, అలాగే విధాన రూపకల్పనలో పారదర్శకతను తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

Caste Census: రాబోయే జనాభా లెక్కల్లో కుల గణనను చేర్చాలని మోదీ మంత్రివర్గం ఇటీవల ముఖ్యమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ చర్య సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ప్రోత్సహించడం, అలాగే విధాన రూపకల్పనలో పారదర్శకతను తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా కాలం నుంచి కుల గణనను డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ చర్య సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ప్రోత్సహిస్తుందని, అలాగే విధాన రూపకల్పనలో పారదర్శకతను నిర్ధారిస్తుందని అన్నారు. అయితే మరి కుల గణన అంటే ఏమిటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుల గణన అంటే ఏమిటి?

కుల గణన అనేది దేశ జనాభాను వారి కులం ఆధారంగా విభజించే ప్రక్రియ. భారతదేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా లెక్కలు సాధారణంగా వయస్సు, లింగం, విద్య, ఉపాధి లాంటి ఇతర సామాజిక-ఆర్థిక పారామితులపై డేటాను సేకరిస్తాయి. అయితే, సామాజిక ఐక్యతను ప్రోత్సహించడానికి, కుల విభజనలను తగ్గించడానికి 1951 తర్వాత కుల డేటా సేకరణ నిలిచిపోయింది. ప్రస్తుతం, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) జనాభా డేటాను మాత్రమే సేకరిస్తున్నారు. కానీ ఇతర వెనుకబడిన తరగతులు (OBC), జనరల్ కేటగిరీ కులాలకు సంబంధించిన అధికారిక డేటా మాత్రం అందుబాటులో లేదు. 2025లో జరగనున్న జనాభా లెక్కల్లో అన్ని కులాల డేటాను సేకరించే దిశగా కేంద్ర మంత్రివర్గం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. సామాజిక-ఆర్థిక విధానాలను మరింత ప్రభావవంతంగా మార్చడానికి, ముఖ్యంగా అణగారిన వర్గాలకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కుల గణన చరిత్ర

భారతదేశంలో కుల గణన చరిత్ర వలస పాలన కాలంతో ముడిపడి ఉంది. మొదటి జనాభా గణన 1872లో జరిగింది. 1881 నుండి ఈ ప్రక్రియ ప్రతి పదేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా నిర్వహించారు. అప్పట్లో కుల డేటాను సేకరించడం సర్వసాధారణం. అయితే, 1951లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, కుల డేటాను సేకరించడం సామాజిక ఐక్యతకు హానికరం అని నిర్ణయించారు. దీంతో కేవలం ఎస్సీ, ఎస్టీల డేటాను మాత్రమే సేకరించారు.

కానీ గత కొన్ని సంవత్సరాలుగా, సామాజిక, రాజకీయ రంగాల్లో కీలక మార్పులు వచ్చాయి. ఇప్పుడు OBC కమ్యూనిటీకి రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల కోసం డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితిలో, కుల గణన డిమాండ్ మళ్ళీ ఊపందుకుంది. 2011లో, యూపీఏ ప్రభుత్వం సామాజిక-ఆర్థిక, కుల గణన (SECC) నిర్వహించింది, కానీ దాని డేటాను వ్యత్యాసాల కారణంగా బహిరంగర్చలేదు. బీహార్ , రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాలు స్వతంత్ర కుల సర్వేలు నిర్వహించాయి. దాని ఫలితాలు ఈ అంశాన్ని జాతీయ చర్చలోకి తెచ్చాయి.

మరోపక్క కాంగ్రెస్, ఆర్జేడీ, ఎస్పీ వంటి ప్రతిపక్ష పార్టీలు సైతం చాలా కాలంగా ఈ తరహా సర్వే కోసం డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షం జేడీయూ కూడా కుల గణనకు అనుకూలంగా ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దీన్ని సామాజిక న్యాయం ఆధారంగా పేర్కొంటూ ఒక ప్రధాన అంశంగా మార్చారు. ప్రాంతీయ పార్టీలు కుల డేటా విధాన రూపకల్పనలో సహాయపడుతుందని నమ్ముతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో దీన్ని పరిపాలనాపరంగా సంక్లిష్టంగా, సామాజిక ఐక్యతకు ముప్పుగా పరిగణించింది.

కుల గణన వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి వైపు ఇది ఒక విప్లవాత్మక అడుగు కావచ్చని కుల గణన మద్దతుదారులు విశ్వసిస్తున్నారు. వివిధ వర్గాల సామాజిక-ఆర్థిక స్థితిని ప్రభుత్వం బాగా అర్థం చేసుకోవడానికి కుల డేటా సహాయపడుతుందని అంటున్నారు. ఉదాహరణకు, విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలలో ఏ కులాలు ఎక్కువగా వెనుకబడి ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీని వల్ల సంక్షేమ పథకాలను మరింత ప్రభావవంతంగా మార్చవచ్చు.

కుల గణన చారిత్రాత్మకంగా అణగదొక్కబడిన వర్గాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. కుల డేటా సామాజిక అసమానతలను హైలైట్ చేస్తుంది. ప్రభుత్వం, సమాజం ఈ సమస్యలను పరిష్కరించడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఉదాహరణకు, ఒక నిర్దిష్ట కులం ఆదాయం లేదా విద్యా స్థాయి జాతీయ సగటు కంటే గణనీయంగా తక్కువగా ఉంటే, దీన్ని మెరుగుపరచడానికి విధానాలను రూపొందించవచ్చు.

అంతేకాకుండా, OBCలు, ఇతర వెనుకబడిన వర్గాల జనాభా ఖచ్చితమైన జనాభా లేకపోవడంతో, రిజర్వేషన్ విధానాలను అమలు చేయడం, వనరులను న్యాయంగా పంపిణీ చేయడం కష్టంగా మారింది. మండల్ కమిషన్ (1980) OBC జనాభాను 52%గా అంచనా వేసింది. కానీ ఈ అంచనా పాత డేటా ఆధారంగా రూపొందించారు. కొత్త డేటా రిజర్వేషన్ల పరిధి, పంపిణీని మరింత పారదర్శకంగా చేయవచ్చు.

Also Read : Govt Schemes: రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు.. బిజినెస్ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్

Caste Census: 74 ఏళ్ల తర్వాత దేశంలో కుల గణన.. ప్రయోజనాలివే

📲 Follow Us

Star Trinethram

Star Trinethram (Telugu News) is Top News Source That Provide Latest and Breaking News in Telugu. Read Andhra Pradesh, Telangana, National and International Telugu News Updates Online. News on Politics, Business, Entertainment, Technology, Sports, Lifestyle and more at startrinethram.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *