Tragedy: ఎనిమిదేళ్ల బాలుడి ప్రాణాన్ని భద్రాచలం ప్రభుత్వ వైద్యులు కాపాడారు. తుమ్మల గౌతమ్ అనే చిన్నారి పొరపాటున ఆరు సెంటీమీటర్ల స్క్రూ డ్రైవర్ డ్రిల్ బిట్ మింగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
పాఠశాల నుంచి వచ్చి ఇంట్లో ఆటలాడుతుండగా బాలుడు డ్రిల్ బిట్‌ను మింగేశాడు. కొద్ది సేపటికి అతనికి తీవ్రమైన కడుపు నొప్పి ప్రారంభమైంది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
బాలుడి వయసును పరిగణనలోకి తీసుకుని అనుమానంతో ఎక్స్‌రే చేసిన వైద్యులు, డ్రిల్ బిట్ పెద్ద పేగులో అడ్డంగా ఇరుక్కుపోయినట్టు గుర్తించారు. గౌతమ్ తీవ్ర నొప్పితో వేదన చెందుతుండటంతో సూపరిండెంట్ డాక్టర్ రామకృష్ణ తక్షణం శస్త్రచికిత్స చేపట్టారు.
దాదాపు మూడు గంటలపాటు శ్రమించి చివరికి డ్రిల్ బిట్‌ను విజయవంతంగా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఉపశమనం పొందారు. ప్రస్తుతం గౌతమ్‌ను ఐసియూలో ఉంచి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.
ఈ సంఘటన తల్లిదండ్రులకు పెద్ద షాక్ ఇచ్చినా, వైద్యుల సమయోచిత స్పందన బాలుడి ప్రాణాలను రక్షించింది.


