Kantara: కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం తెలుగు యువత ఆగ్రహానికి గురవుతున్నారు. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న కాంతార 1 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఆ వేడుకలో రిషబ్ శెట్టి అందరినీ షాక్‌కు గురిచేశారు. తెలుగు నేల మీదకు వచ్చి ఆయన ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడలేదు. మొత్తం ఈవెంట్‌లో పూర్తిగా కన్నడలోనే మాట్లాడారు.
దీనిపై యువత అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. “తెలుగు రాకపోతే కూడా కనీసం రెండు మాటలు మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు కదా. హిందీ హీరో హృతిక్ రోషన్ వచ్చినా నాలుగు మాటలు తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించాడు. కానీ రిషబ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు” అంటూ విమర్శలు చేస్తున్నారు.
అదే సమయంలో కర్ణాటకలో తెలుగుసినిమాలపై జరిగిన వివాదాలను గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై అక్కడి సంఘాలు పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా హరిహర వీరమల్లు పోస్టర్లు తెలుగులో ఉన్నాయని చింపేసిన ఘటన కూడా అందరికీ గుర్తుంది. “అంత చిన్న విషయానికే అక్కడ అంత హంగామా చేశారు కదా… మరి ఇక్కడ రిషబ్ తెలుగు మాట్లాడకపోవడాన్ని మేము మౌనం వహించాలా?” అని యువత ప్రశ్నిస్తోంది.
ఇక సోషల్ మీడియాలో రిషబ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. కాంతార 1ను తెలుగు రాష్ట్రాల్లో బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ఆయన కావాలనే తెలుగు భాషను తక్కువ చేశారని ఆరోపిస్తున్నారు. “తమిళనాడుకెళ్తే తమిళంలో మాట్లాడతాడు, ముంబై వెళ్తే హిందీలో మాట్లాడతాడు… కానీ హైదరాబాద్ వస్తే మాత్రం తెలుగే తెలియనట్టు ప్రవర్తించాడు. తెలుగు అంటే అంత చిన్నచూపా?” అంటూ యువత మండిపడుతున్నారు. దీంతో కాంతార 1 రిలీజ్‌కి ముందే తీవ్ర నెగెటివిటీ చుట్టుముట్టింది.
Also Read: Tea: టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా..?
Kantara: తెలుగోళ్లంటే అంత చిన్న చూపా.. రిషబ్ శెట్టిపై విమర్శలు


