Tragedy: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లక్కారం గ్రామానికి చెందిన జాదవ్ సాయితేజ (19) ఘట్కేసర్ మండలం కొర్రెములలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. నారపల్లిలోని వసతిగృహంలో నివసిస్తూ చదువు కొనసాగిస్తున్నాడు.
కొద్ది రోజుల క్రితం, ఒక ఫస్ట్‌యియర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలకు సాయితేజ తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి వెళ్లాడు. అక్కడ చిన్నపాటి గొడవ జరగగా, సీనియర్ బండారి చిన్నబాబు వారిని రాజీ చేయించాడు. కానీ ప్రతిఫలంగా పార్టీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆదివారం రాత్రి నారపల్లిలోని ఓ బార్‌లో చిన్నబాబు సహా ఎనిమిది మంది విద్యార్థులు మద్యం తాగి రూ.8 వేల బిల్లు చేశారు. సాయితేజ తన వద్ద ఉన్న రూ.2,500 మాత్రమే చెల్లించగలిగాడు. మిగతా డబ్బులు అడుగుతూ చిన్నబాబు అవమానకరంగా మాట్లాడడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
తరువాత వసతిగృహానికి వెళ్లిన సాయితేజ, తండ్రికి వీడియో కాల్ చేసి “చిన్నబాబు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కొద్ది సేపటికే ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు చిన్నబాబు సహా ఎనిమిది మందిపై ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద, మేడిపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేపట్టాయి. పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చిన్నబాబు సంవత్సరం రోజులుగా కళాశాలకు హాజరు కాలేదని కాలేజీ నిర్వాహకులు స్పష్టం చేశారు.


