HomeUncategorizedBudget 2026: పెరిగేవి.. తగ్గేవి ఇవే..

Budget 2026: పెరిగేవి.. తగ్గేవి ఇవే..

📰 Generate e-Paper Clip

Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పన్నులు, కస్టమ్స్ డ్యూటీలు, టీసీఎస్, టిడిఎస్‌లో చేసిన మార్పుల కారణంగా కొన్ని వస్తువులు, సేవల ధరలు తగ్గే అవకాశం ఉండగా.. మరికొన్ని వస్తువుల ధరలు మాత్రం పెరగనున్నాయి. దీంతో బడ్జెట్ ఎఫెక్ట్‌గా మార్కెట్‌లో వినియోగదారులపై పడే భారం ఎటువైపు ఉంటుందనే అంశంపై చర్చ మొదలైంది.

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా అనేక రంగాల్లో పన్ను భారాన్ని తగ్గించింది. విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్య, ఆరోగ్య రంగం, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు సామాన్యులకు లాభం చేకూర్చేలా ఉన్నాయి. మరోవైపు విలాసవంతమైన వస్తువులు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ట్రేడింగ్ చేసే వారిపై మాత్రం అదనపు భారం పడనుంది.

బడ్జెట్ ప్రభావంతో విదేశీ పర్యాటక ప్యాకేజీల ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది. వీటిపై ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్‌ను 2 శాతానికి తగ్గించడం వల్ల విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వారికి కొంత ఊరట లభించనుంది.

అలాగే విదేశీ విద్యపై కూడా పన్ను భారాన్ని తగ్గించారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం కింద విద్యా ఖర్చుల కోసం విధించే టిడిఎస్‌ను సడలించడం ద్వారా విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఆర్థికంగా ఉపశమనం లభించనుంది.

పరిశ్రమల పరంగా చూస్తే.. ఆల్కహాలిక్ లిక్కర్ తుక్కు, కొన్ని రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. దీనివల్ల ఆయా రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశముంది.

షూ అప్పర్ ఎగుమతులకు అవసరమైన మెటీరియల్‌ను డ్యూటీ రహితంగా ప్రకటించడం వల్ల ఎగుమతుల రంగానికి ఊతం లభించనుంది.

అలాగే సోలార్ ప్యానల్స్ తయారీకి అవసరమైన కీలక మెటీరియల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తొలగించడం ద్వారా పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.

ఎనర్జీ ట్రాన్సిషన్‌కు సంబంధించిన పరికరాలు, క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్ మినరల్స్‌పై బీసీడీ మినహాయింపు ఇవ్వడం వల్ల గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు ఊతం లభించనుంది.

వ్యక్తిగత వినియోగానికి వాడే కొన్ని పరికరాలపై బీసీడీని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడంతో వాటి ధరలు తగ్గే అవకాశముంది.

ఆరోగ్య రంగంలో కీలక నిర్ణయంగా క్యాన్సర్, అరుదైన వ్యాధులు, డయాబెటిక్ చికిత్సకు వాడే 17 రకాల ఔషధాలపై బీసీడీని పూర్తిగా తొలగించారు. దీని వల్ల ఈ ఔషధాలు మరింత అందుబాటులోకి రానున్నాయి.

అలాగే మన దేశ తీరప్రాంతం నుంచి ప్రత్యేక ఆర్థిక మండలి పరిధి వరకు ఉన్న సముద్ర జలాల్లో భారత జాలర్లు పట్టుకునే చేపలపై పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా మత్స్యకారులకు లాభం చేకూరనుంది.

అణు విద్యుత్తు ప్రాజెక్టులకు అవసరమైన పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలు, దేశంలో తయారయ్యే స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, విమానాల విడిభాగాలపై డ్యూటీ తగ్గింపులు చేయడంతో ఆయా రంగాల్లో ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇక మరోవైపు, ఈ బడ్జెట్‌లో కొన్ని రంగాలపై అదనపు భారం పడనుంది. ఆదాయ వివరాలు సరిగ్గా వెల్లడించని వారికి విధించే జరిమానాను 100 శాతం వరకు పెంచారు.

బహిర్గతం చేయని చరాస్తులపై కూడా ఇప్పుడు జరిమానా విధించే నిబంధనలను కఠినతరం చేశారు.

ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్‌పై పన్ను భారాన్ని పెంచడంతో స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వారికి ఖర్చు పెరగనుంది.

విలాసవంతమైన వాచ్‌లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాల, గుట్కా వంటి వస్తువులపై పన్నులు పెరగడం వల్ల వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది.

కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాలపై కూడా అదనపు భారం పడనుంది.

కొన్ని రకాల ఎరువులపై దిగుమతి ఫీజులను తొలగించినప్పటికీ, అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రో ఫాస్ఫేట్ వంటి ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే చిత్రీకరణకు వాడే పరికరాలు, కెమెరాల ధరలు కూడా పెరగవచ్చని అంచనా.

మొత్తంగా చూస్తే.. ఈ బడ్జెట్ సామాన్యులకు కొన్ని రంగాల్లో ఊరటనిస్తూనే, ఆర్థిక క్రమశిక్షణ పేరుతో కొన్ని విభాగాలపై భారం మోపినట్లు కనిపిస్తోంది. ధరలు తగ్గే వస్తువులు, పెరిగే వస్తువుల మధ్య సమతూకం సాధిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ బడ్జెట్‌ను విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ALSO RAED: Budget 2026: టాప్-10 హైలైట్స్ ఇవే

RELATED ARTICLES

Most Popular