HomeUncategorizedTelangana: మహిళా లెక్చరర్‌కు అసభ్యకర మెసేజ్‌లు.. సీన్ కట్ చేస్తే..

Telangana: మహిళా లెక్చరర్‌కు అసభ్యకర మెసేజ్‌లు.. సీన్ కట్ చేస్తే..

📰 Generate e-Paper Clip

Telangana: మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రంలో ఉన్న గిరిజన గురుకుల మహిళా కళాశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే మహిళా లెక్చరర్‌పై వేధింపులు, అనంతరం భౌతిక దాడి జరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని నెలలుగా ఓ యువకుడు ఆమెను మానసికంగా వేధిస్తుండగా, చివరకు కళాశాల ప్రాంగణంలోనే దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో ఉపాధ్యాయ వర్గాలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సమాచారం ప్రకారం, కళాశాలలో క్యాటరింగ్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న వ్యక్తి కుమారుడు రమేష్ అనే యువకుడు అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా లెక్చరర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఫోన్ నంబర్ సంపాదించిన అనంతరం తరచూ అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. దాదాపు 6 నెలలుగా ఈ వేధింపులు కొనసాగినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

యువకుడి ప్రవర్తనపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతడిలో ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది. పైగా రోజురోజుకూ వేధింపులు మరింత పెరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన రమేష్ కళాశాల ప్రాంగణంలోకి ప్రవేశించి, ఒంటరిగా ఉన్న మహిళా లెక్చరర్‌ను బెదిరించినట్లు సమాచారం. అనంతరం అందరి సమక్షంలోనే ఆమెపై దాడి చేసి చెంపపై కొట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంస్థలోనే ఇలాంటి ఘటన జరగడం ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో ఆందోళన కలిగించింది.

వేధింపులు, దాడితో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా లెక్చరర్ చివరకు కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై తోటి ఉపాధ్యాయులు, మహిళా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో పనిచేసే మహిళా సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Viral News: ఒక్క వెన్న ప్యాకెట్.. నకిలీ ఐపీఎస్ బండారం బయటపెట్టింది!

RELATED ARTICLES

Most Popular