చెట్టు నీడకూ అద్దె..?
వ్యాపారులకు కాసుల పంట
ఆకాశానికి చికెన్, మటన్ ధరలు
కేజీ మటన్ రూ.1500
భక్తులపై పెరుగుతున్న ఆర్థిక భారం
స్టార్ త్రినేత్రం, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం అసలు జాతర మొదలుకాగా, జనవరి 30 వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రధాన జాతర ప్రారంభంతోనే మేడారం అడవులు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
భక్తులు పోటెత్తడంతో మేడారం పరిసర ప్రాంతాల్లో అడుగుపెట్టడానికి కూడా చోటు లేకుండా మారింది. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూల్లో భక్తులు నిలబడి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బెల్లం, కోళ్లు, మేకలు సమర్పిస్తూ తమ కోరికలు తీర్చాలని అమ్మవార్లను వేడుకుంటున్నారు. లక్షలాది మంది రాకతో జాతర వాతావరణం ఆధ్యాత్మికతతో పాటు జన సందోహంతో ఉప్పొంగిపోతోంది.
భక్తుల రద్దీ పెరగడంతో మేడారంలో వ్యాపారులు కాసుల పంట పండిస్తున్నారు. చికెన్, మటన్, మద్యం, కొబ్బరికాయలు, బెల్లం నుంచి అద్దె గదుల వరకు అన్నింటి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. జాతర సందర్భంగా అవసరమైన ప్రతి వస్తువును అధిక ధరలకు విక్రయిస్తూ భక్తులపై ఆర్థిక భారం మోపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొక్కుల కోసం కోళ్లు, మేకలు సమర్పించే భక్తులు ఎక్కువగా ఉండటంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణంగా బయట మార్కెట్లో కిలో లైవ్ కోడి ధర రూ.170 ఉండగా, మేడారం జాతరలో మాత్రం ఏకంగా రూ.350కి విక్రయిస్తున్నారు. అలాగే కిలో మటన్ ధర రూ.1500కు చేరింది. లైవ్ మేక బయట కిలో రూ.420 ఉంటే, జాతరలో మాత్రం రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు.
మద్యం ధరలూ ఇదే స్థాయిలో పెరిగాయి. బీర్, విస్కీ, బ్రాందీ వంటి మద్యంపై ఒక్కో బాటిల్‌కు రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. నాటుకోడి ధర కూడా బయట రూ.400 ఉండగా, జాతర పరిసర ప్రాంతాల్లో రూ.700కి విక్రయిస్తున్నారు. జాతర ఇంకా 3 రోజులు కొనసాగనున్న నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక నివాస సమస్య భక్తులను మరింత ఇబ్బంది పెడుతోంది. జాతర ప్రాంతంలో గదుల అద్దెలు అమాంతంగా పెరిగిపోయాయి. ఒక రోజు అద్దెకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు. సామాన్య భక్తులకు ఈ ధరలు భారంగా మారుతున్నాయి. దీంతో చాలామంది చెట్ల కిందనే విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే చెట్టు నీడ కూడా ఇప్పుడు అద్దెకే మారింది. మేడారం సమీపంలోని తోటల యజమానులు ఒక్కో చెట్టుకు రూ.వెయ్యి వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. కుటుంబంతో కలిసి కొంత సేపు విశ్రాంతి తీసుకునేందుకు భక్తులు డబ్బులు చెల్లించి చెట్లను అద్దెకు తీసుకుంటున్నారు. చెట్టు నీడకు కూడా డబ్బులు వసూలు చేసే స్థాయికి దోపిడీ చేరిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALSO READ: Warangal Politics: సొంత గూటికి ఆరూరి రమేష్
Last Updated on January 28, 2026 · 5:25 PM by Star Trinethram



