Telangana Politics: ఏడాది తర్వాత బహిరంగ సభకు కేసీఆర్..

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకే రోజు అధికార, ప్రతిపక్ష నాయకులు కీలక పర్యటనలకు సిద్ధమవుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రేపు జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కే.చంద్రశేఖర్ రావు హాజరుకానుండగా, అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు వెళ్లనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార, ప్రతిపక్ష నేతల ఈ సమాంతర పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ మైండ్ గేమ్ మొదలైందా అనే సందేహాలకు తావిస్తున్నాయి.

దాదాపు ఒక సంవత్సర కాలం తర్వాత ప్రజల ముందుకు రాబోతున్న కేసీఆర్ సభపై ప్రత్యేక దృష్టి నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజా వేదికలపై కనిపించని ఆయన, గతేడాది 27 ఏప్రిల్ న వరంగల్‌లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల తర్వాత మళ్లీ బహిరంగ సభలో పాల్గొనలేదు. అత్యవసర కార్యక్రమాలు తప్ప మిగతా వ్యవహారాలన్నీ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచే నిర్వహిస్తూ వచ్చిన ఆయన, ఇప్పుడు జగిత్యాల సభ ద్వారా మళ్లీ రాజకీయంగా చురుకుదనాన్ని ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ మాజీ నేత జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశాలు ఉండటంతో ఈ సభకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

ఇన్నాళ్లు అధికార పక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనా మౌనంగా ఉన్న కేసీఆర్ ఈసారి తన ప్రసంగంలో ఎలాంటి వ్యూహం అవలంబిస్తారన్నది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఆయన టార్గెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటారా, లేక ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అలాగే తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాల నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడుపై కూడా విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కొనసాగుతోంది.

ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళ్తుండటం మరో హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ లోపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చూపించాలన్నదే ఆయన వ్యూహంగా తెలుస్తోంది. ఇటీవల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం అంశంపై ముఖ్యమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది కూడా రాజకీయంగా ప్రాధాన్యత పొందింది.

ఇలా ఒకే రోజు అధికార, ప్రతిపక్ష నేతల పర్యటనలు జరగడం తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠను పెంచింది. జగిత్యాల సభ ద్వారా ఒకవైపు ప్రతిపక్షం తన శక్తిని ప్రదర్శించేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు మేడిగడ్డ పర్యటన ద్వారా అధికార పక్షం ప్రతిస్పందన ఇవ్వబోతోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుకు దారితీస్తాయా అన్నది చూడాల్సి ఉంది.

Last Updated on April 19, 2026 · 2:58 PM by Sandeep Kumar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles