Dowry: రియల్లీ గ్రేట్.. ఒక్క రూపాయినే కట్నంగా తీసుకుని గొప్ప మనసు చాటుకున్న వరుడు
ఈ రోజుల్లో కొందరు తమ సంపదను, కీర్తిని చూపించుకునేందుకు భారీ కట్నాన్ని వరుడికి సమర్పించుకుంటున్నారు. పెళ్లి కొడుకులు కూడా తమ హోదాకు తగ్గట్టుగా కట్నం వసూలు చేస్తున్నారు.
Dowry: ఈ రోజుల్లో కొందరు తమ సంపదను, కీర్తిని చూపించుకునేందుకు భారీ కట్నాన్ని వరుడికి సమర్పించుకుంటున్నారు. పెళ్లి కొడుకులు కూడా తమ హోదాకు తగ్గట్టుగా కట్నం వసూలు చేస్తున్నారు. అమ్మాయిలు దొరకటం లేదని అంటున్నప్పటికీ.. చాలా చోట్ల ఇప్పటికీ కట్నం తగ్గిందని పెళ్లి మాఫీ చేసుకునేవాళ్లూ ఉన్నారు. కానీ ఓ వరుడు చేసిన పని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. అతను కేవలం ఒక్క రూపాయినే కట్నంగా తీసుకున్నాడు. అత్తామామలు ఇచ్చిన రూ.31 లక్షల కట్నాన్ని వివాహ వేదికపైనే తిరిగిచ్చేసి తన గొప్పతనం చాటుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ లోని సహరాన్‌పూర్ జిల్లా భాబ్సి రాయ్‌పూర్ గ్రామానికి చెందిన శ్రీపాల్ రాణా కుమారుడు వికాస్ రాణా యువ న్యాయవాది. అతను లాయరే కాదు.. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కూడా. రాణా తండ్రి శ్రీపాల్ రాణా రాజకీయ నేత. గత ఎన్నికల్లో బీఎస్పీ టికెట్‌పై యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. వికాస్ రాణాకు పెద్దలు హర్యానాలోని లుక్ఖి గ్రామానికి చెందిన అగ్రికా తన్వర్‌తో పెళ్లి సంబంధం కుదిర్చారు. ఏప్రిల్ 30న వికాస్ రాణా, అగ్రికా తన్వర్‌కు పెళ్లి ముహూర్తం కుదిరింది. దీంతో ఆ రోజున వికాస్ రాణా కుటుంబం ఊరేగింపుగా హర్యానాలోని కురుక్షేత్రకు వెళ్లారు. అక్కడున్న ఒక హోటల్‌లో అట్టహాసంగా వివాహ వేడుకకు ఏర్పాట్లు చేశారు. వివాహ వేడుకలో భాగంగా తిలకం వేడుక జరుగుతున్న సమయంలో వధువు తల్లిదండ్రులు..పెళ్లికొడుకు వికాస్ రాణాకు వరకట్నంగా రూ.31 లక్షల నగదును అందజేశారు.
కానీ ఎవరూ ఊహించని విధంగా వికాస్ రాణా గొప్ప మనసు చాటుకున్నాడు. ఏప్రిల్ 30న హర్యానాలోని కురుక్షేత్రలో అగ్రిక తన్వర్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక జరుగుతుండగా, అందరూ వివాహాన్ని ఆనందిస్తుండగా, కట్నం రూపంలో నగదు తీసుకోవడానికి వికాస్ నిరాకరించడం ఇరు కుటుంబాలను, బంధువులను ఆశ్చర్యపరిచింది. తనకు వరకట్నం కింద ఇచ్చిన రూ. 31 లక్షలను అత్తమామలకు తిరిగి ఇచ్చేశాడు. కేవలం ఒక్క రూపాయి, ఒక కొబ్బరి కాయను కట్నం కింద తీసుకుని పెళ్లి క్రతువు ముగించేశాడు యువ న్యాయవాది. వరకట్నం తీసుకోవడం సామాజిక దురాచారం అని వికాస్ పేర్కొన్నాడు. కట్నం తీసుకోకపోవడం ద్వారా వికాస్ రాణా సభ్య సమాజానికి, ఈతరం యువతకు గొప్ప సందేశాన్ని ఇచ్చారు.
“ఈ వివాహంలో నాకు లభించిన ఉత్తమ బహుమతి అగ్రిక” అని వికాస్ డబ్బును తిరిగి ఇవ్వడానికి కారణాన్ని వివరిస్తూ అన్నాడు. కర్ణాటక హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న వికాస్ కొంతకాలం క్రితం బీఎస్పీ టికెట్‌పై కైరానా లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. అగ్రికతో ఆయన వివాహం ఇప్పుడు పట్టణంలోనే కాకుండా రెండు రాష్ట్రాలలోనూ చర్చనీయాంశంగా మారింది.
Also Read : Naiki Devi : మహమ్మద్ ఘోరీని గడగడలాడించి.. పారిపోయేలా చేసిన రాణి ఈమెనే
Dowry: రియల్లీ గ్రేట్.. ఒక్క రూపాయినే కట్నంగా తీసుకుని గొప్ప మనసు చాటుకున్న వరుడు