HomeGovt Schemesకొత్త పథకం: కేంద్రం నుంచి ప్రతీ నెలా రూ.3 వేలు

కొత్త పథకం: కేంద్రం నుంచి ప్రతీ నెలా రూ.3 వేలు

📰 Generate e-Paper Clip

కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, గృహ సహాయకులు వంటి వర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం అందించేలా నెలకు రూ.3000 పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఉద్యోగ విరమణ అనంతరం ప్రతీ నెలా ఈ పెన్షన్ అందడం ద్వారా జీవన భద్రతను పెంపొందించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే ముందుగా దరఖాస్తు చేసి, నిర్దిష్ట మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని అర్హత ప్రమాణాలు ఉన్నాయి. అభ్యర్థి వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలవారీ ఆదాయం రూ.15,000 కంటే తక్కువగా ఉండటం తప్పనిసరి. అలాగే ఈపీఎఫ్, ఎన్‌పీఎస్ వంటి ఇతర పెన్షన్ పథకాలలో సభ్యత్వం ఉండకూడదు. ఈ అర్హతలను పూర్తి చేసినవారే ఈ పథకంలో చేరేందుకు అర్హులవుతారు. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మంది కార్మికులకు ఇది ఒక భరోసా పథకంగా నిలుస్తోంది.

ప్రీమియం విషయానికి వస్తే.. ఇది అభ్యర్థి వయస్సు, భవిష్యత్తులో పొందదలచుకున్న పెన్షన్‌ను ఆధారంగా చేసుకుని నిర్ణయించబడుతుంది. సాధారణంగా ప్రీమియం మొత్తాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో చేరిన వ్యక్తి నెలకు రూ.55 చెల్లిస్తే సరిపోతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ పథకంలో చేరితే ప్రీమియం కూడా పెరుగుతుంది. ఒకసారి చేరిన తర్వాత 60 సంవత్సరాల వయస్సు వరకు నిరంతరంగా అదే ప్రీమియం చెల్లించాలి. అనంతరం 60 సంవత్సరాలు పూర్తయ్యాక ప్రతి నెలా రూ.3000 పెన్షన్ లభిస్తుంది. పథకంలో సభ్యుడు మరణించిన పక్షంలో అతని జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ అందించబడుతుంది. అంటే నెలకు రూ.1500 వరకు లభిస్తుంది.

దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఇళ్ల నుంచే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ వంటి ప్రాథమిక పత్రాలు అవసరం. స్వయంగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వ మాన్ ధన్ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇప్పటివరకు సుమారు 52.5 లక్షల మంది ఈ పథకంలో చేరడం గమనార్హం. ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఒక స్థిరమైన ఆదాయ భరోసా లభించే అవకాశం ఉంది.

ALSO READ: Mystery: గుప్తనిధులు దొరికాయని హ్యాపీగా ఉన్నారా?

RELATED ARTICLES

Most Popular