HomeInterestingScience Discovery: డైనోసార్ రియల్ వాయిస్ ఇలా ఉంటుందట!

Science Discovery: డైనోసార్ రియల్ వాయిస్ ఇలా ఉంటుందట!

📰 Generate e-Paper Clip

Science Discovery: భారీ ఆకారం, గంభీరమైన నడక, భయానక రూపం.. డైనోసార్లు అంటే మనకు గుర్తొచ్చేది ఇదే. వాటి గర్జన వినిపిస్తే గుండెల్లో పులకరింత కాకుండా భయం పుడుతుందని సినిమాలు మనకు నమ్మించాయి. ముఖ్యంగా జురాసిక్ పార్క్ వంటి చిత్రాలు డైనోసర్లను అత్యంత భయానకంగా చూపిస్తూ ప్రేక్షకులను థియేటర్లలో కుర్చీలకు అతుక్కుపోయేలా చేశాయి. అయితే ఇప్పటివరకు మనం విన్న ఆ గర్జనలు నిజంగా డైనోసర్లవేనా అన్న ప్రశ్నకు తాజా పరిశోధనలు ఆశ్చర్యకర సమాధానాలు ఇస్తున్నాయి. సినిమాల్లో వినిపించే భారీ గర్జనలు వాస్తవానికి పూర్తిగా కల్పితమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

డైనోసర్లను మనిషి ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడకపోవడం వల్ల, సినిమాలు చూపించిన దృశ్యాలనే నిజంగా నమ్ముతూ వచ్చాం. గత 30 ఏళ్లుగా ఇదే ధోరణి కొనసాగుతోంది. ముఖ్యంగా జురాసిక్ పార్క్ సినిమా విడుదలైన 1993 సంవత్సరం నుంచి డైనోసర్ల గర్జనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. అయితే ఆ సినిమాలో వినిపించిన శబ్దాలు అసలు డైనోసర్లవి కావని తేలింది. ఒక పిల్ల ఏనుగు, ఒక మొసలి, ఒక పులి అరుపులను కలిపి ప్రత్యేకంగా ఆ శబ్దాన్ని సృష్టించారు. ఆ తర్వాత నుంచి అదే శబ్దాన్ని సినిమాలు, డాక్యుమెంటరీలు, థీమ్ పార్కులు, పిల్లల బొమ్మల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీంతో నిజమైన డైనోసర్ స్వరం ఎలా ఉండేదో అన్నది చాలా కాలం వరకు తెలియని రహస్యంగానే మిగిలిపోయింది.

డైనోసర్ల గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అవి పక్షి జాతికి చెందినవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం మనం చూసే పక్షుల్లో, ముఖ్యంగా కోడిలో కనిపించే కొన్ని లక్షణాలు అప్పటి డైనోసర్లలో కూడా ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే వాటి దంతాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండేవి. కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఈ జీవుల శరీరాలు కాలక్రమేణా నేలలో కలిసిపోయి, కేవలం ఎముకలు, దంతాలే మిగిలాయి. వాటి ఆధారంగానే డైనోసర్లు ఎలా ఉండేవో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ వాటి స్వరం గురించి స్పష్టత లేకపోవడానికి కారణం, స్వరపేటికలు వంటి మృదు కణజాలాలు కాలక్రమంలో పూర్తిగా నశించిపోవడమే.

ఈ అనుమానాలకు ముగింపు పలుకుతూ 2023లో శాస్త్రవేత్తలకు ఒక కీలక ఆధారం లభించింది. డైనోసర్‌కు చెందిన స్వరపేటిక భాగం కనుగొనడం ద్వారా వాటి స్వరం గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఆధారాలపై 2025లో జరిగిన మరిన్ని పరిశోధనల ద్వారా డైనోసర్ల అసలైన శబ్దాన్ని అంచనా వేశారు. ఆ పరిశోధనల ప్రకారం డైనోసర్లు క్షీరదాల మాదిరిగా గర్జించకుండా, పక్షుల తరహాలో కూతలు పెట్టేవని తేలింది. ముఖ్యంగా పావురాలు, ఈము (ఒస్ట్రిచ్) పక్షుల అరుపులకు దగ్గరగా ఉండే శబ్దాలు చేసేవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని ద్వారా మనం ఇప్పటివరకు సినిమాల్లో విన్న భయానక గర్జనలు పూర్తిగా కల్పితమేనని స్పష్టమవుతోంది.

మొత్తానికి, డైనోసర్ల గురించి మనకు తెలిసిన అనేక విషయాలు సినిమాల ప్రభావంతో మారిపోయినప్పటికీ, శాస్త్రీయ పరిశోధనలు మాత్రం వాస్తవాన్ని బయటపెడుతున్నాయి. భయానక గర్జనలతో మనసుల్లో భయం నింపిన ఈ జీవులు, వాస్తవానికి పక్షుల మాదిరిగా శబ్దాలు చేసేవి కావడం అనేది ఆశ్చర్యానికి గురిచేసే విషయం. ఒకవేళ సినిమాల్లో కూడా ఇదే నిజమైన శబ్దాన్ని వినిపించి ఉంటే, ప్రేక్షకుల అనుభూతి ఎలా ఉండేదో అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది.

ALSO READ: Vastu Tips: ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఈ దిశలో పెడితే డబ్బుల వర్షం

RELATED ARTICLES

Most Popular