Samantha: అనారోగ్యానికి మించిన సమస్య ఏదీ లేదని ప్రముఖ నటి సమంత (Samantha Ruth Prabhu) అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై తీసుకుంటున్న జాగ్రత్తల గురించి పంచుకున్నారు.
“మనకు ఆరోగ్య సమస్యలు రాకముందు చిన్న చిన్న విషయాలనే పెద్ద సమస్యలుగా భావిస్తాం. వంద ఇబ్బందులు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ, ఒకసారి అనారోగ్యం ఎదురైతే దాని ముందు మిగతావన్నీ చిన్నవిగా మారిపోతాయి. అప్పుడు మనం పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెడతాం” అని సమంత చెప్పారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ, “ప్రస్తుతం నేను నిద్ర, ఆహారం, మానసిక ప్రశాంతతపైనే ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నా. గతంతో పోలిస్తే ఈ విషయాల్లో మరింత కఠినంగా ఉంటున్నా. ఈ మార్పుల వల్ల ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను” అని వివరించారు.
అదేవిధంగా కెరీర్ పరంగానూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. “ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు. మంచి చిత్రాలు చేశామా లేదా అన్నదే ముఖ్యమని నేను భావిస్తున్నా. ఇకపై ఒకేసారి ఐదు సినిమాలు చేయను. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నా” అని చెప్పారు.
ప్రస్తుతం సమంత ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ (Rakht Brahmand) సినిమాలో నటిస్తున్నారు. దర్శక ద్వయం రాజ్–డీకే (Raj & DK) ఈ పీరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆదిత్యరాయ్ కపూర్, అలీ ఫజల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


