Kantara: కన్నడ సినిమా చరిత్రలో సంచలనాన్ని సృష్టించిన చిత్రం కాంతార. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా, హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కి, కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు దీని ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 రాబోతోంది. ఈ సారి హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మాణం చేస్తున్నారని సమాచారం.
ఇటీవల కాంతార: చాప్టర్ 1 కథా సారాంశం (సినాప్సిస్) ఆన్లైన్లో వైరల్ అయింది. దాని ప్రకారం ఈ కథ 2022లో జరిగిన సంఘటనల కంటే శతాబ్దాల క్రితమే, అంటే 300 CEలో కదంబ రాజవంశ పాలనలో మొదలవుతుంది. ఈ సినిమా బనవాసి ప్రాంతంలోని ఆధ్యాత్మిక అడవుల్లోకి ప్రేక్షకులను తీసుకువెళ్లనుంది. అక్కడ దైవిక ఆత్మల మేల్కొలుపు, పురాతన సంప్రదాయాల ఆవిర్భావం, ఆచారాల మూలాలను చూపించనున్నారు.
ఈ క్రమంలో రిషబ్ శెట్టి ఓ భయానక నాగ సాధువుగా కనిపించబోతున్నారు. మానవులు మరియు దైవిక శక్తుల మధ్య వారధిగా, యోధుడిగానూ ఆధ్యాత్మికవేత్తగానూ ఆయన పాత్ర తీర్చిదిద్దబడింది. పురాతన ఆచారాలు, అతీంద్రియ శక్తులు, గిరిజన పోరాటాలను విభిన్నమైన సినిమాటిక్ దృశ్యాలతో చూపించబోతున్నారని టీమ్ చెబుతోంది.
నిర్మాణ సంస్థ ప్రకారం కాంతార: చాప్టర్ 1 కేవలం ప్రీక్వెల్ మాత్రమే కాదు, ఒక పురాణం పుట్టుక. అదీ కాకుండా ఇది విజువల్ వండర్‌గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. రిషబ్ శెట్టి నటన మరోసారి సినిమాకి హైలైట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కాంతార: చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


