Viral: ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పుర్ జిల్లా కుచ్‌ముచ్ గ్రామంలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 75 ఏళ్ల వయసులో ఒంటరి జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న వృద్ధుడు రెండో పెళ్లి చేసుకున్నా, ఆ సంతోషం ఒక్కరోజు కూడా నిలవలేదు. పెళ్లైన మరుసటి రోజు ఉదయమే ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే… సంగ్రురామ్ (75) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం ఆయన మొదటి భార్య మరణించడంతో పిల్లలు లేని సంగ్రురామ్ పూర్తిగా ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. ఈ వయసులో పెళ్లి అవసరమా అని కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినా, ఒంటరితనం భరించలేక రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జలాల్‌పూర్‌కు చెందిన మన్‌భవతి (35)తో సెప్టెంబర్ 29న పెళ్లి జరిగింది. ముందుగా కోర్టులో వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆ తర్వాత ఆలయంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి అనంతరం మన్‌భవతి మాట్లాడుతూ, ఇంటి బాధ్యతలు తానే చూసుకుంటానని, పిల్లల విషయాన్ని తానే చూసుకుంటానని భర్త హామీ ఇచ్చినట్లు తెలిపింది. పెళ్లిరాత్రి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారని కూడా చెప్పింది. అయితే మరుసటి రోజు ఉదయం సంగ్రురామ్ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఆకస్మిక మరణం గ్రామంలో అనేక అనుమానాలకు తావిచ్చింది. వయసు కారణంగానే సహజ మరణం అయి ఉండొచ్చని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఈ మృతి వెనుక ఏదో మర్మం ఉందని అనుమానిస్తున్నారు. ఢిల్లీలో నివసిస్తున్న సంగ్రురామ్ మేనల్లుళ్లు ఈ విషయం తెలుసుకొని, తాము వచ్చే వరకు అంత్యక్రియలు జరపవద్దని కుటుంబసభ్యులను ఆపేశారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ, పోస్టుమార్టం జరుగుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


