STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 3:11 pm Posted by : ARUN

Delimitation: డీలిమిటేషన్‌ అంటే ఏంటీ…రాష్ట్రాల వారీగా పెరిగే సీట్ల సంఖ్య వివరాలతో!

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌పై కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని ప్రతిపాదించింది. రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిలో మార్పులు రాకుండా 2051 వరకు స్తంభింపజేయాలని కూడా ప్రతిపాదించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ 30 నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది మోడీ సర్కార్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తును కేంద్రం ప్రారంభించగా డీఎంకే, శరద్ పవార్(ఎన్సీపీ) మద్దతు ప్రకటించాయి.

డీలిమిటేషన్ బిల్లు అంటే ఏమిటి?

డీలిమిటేషన్ అంటే ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించడం, జనాభా గణాంకాల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో సీట్ల సంఖ్యను సర్దుబాటు చేయడం. భారతదేశంలో ఈ ప్రక్రియను స్వతంత్ర డీలిమిటేషన్ కమిషన్ నిర్వహిస్తుంది. కమిషన్ ఖరారు చేసిన ఆదేశాలకు చట్టబద్ధత ఉంటుంది. వాటిని న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీలుండదు.

2026 ఏప్రిల్ 16న కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026, డీలిమిటేషన్ బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో అది ఆమోదం పొందలేదు.

కొత్త డీలిమిటేషన్ బిల్లులో కీలక ప్రతిపాదనలు

50 శాతం సీట్ల పెంపు: దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ, శాసనసభ స్థానాలను ఏకరీతిలో 50 శాతం పెంచాలని ప్రతిపాదించారు.

లోక్‌సభ సీట్ల గరిష్ఠ పరిమితి పెంపు: ప్రస్తుతం ఉన్న 550 స్థానాల గరిష్ఠ పరిమితిని 850కి పెంచాలని ప్రతిపాదించారు. ఇందులో రాష్ట్రాలకు గరిష్ఠంగా 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది.

అసెంబ్లీ స్థానాల పెంపు: రాష్ట్ర శాసనసభల్లో ప్రస్తుతం ఉన్న 500 స్థానాల గరిష్ఠ పరిమితిని 650కి పెంచాలని ప్రతిపాదించారు. జనాభా పెరుగుదల తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా రాష్ట్రాల మధ్య ప్రస్తుత లోక్‌సభ సీట్ల నిష్పత్తిని 2051 వరకు యథాతథంగా కొనసాగించాలని ప్రతిపాదించారు. అయితే నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ఉపయోగించనున్నట్లు సమాచారం.

లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను డీలిమిటేషన్‌తో అనుసంధానించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ రిజర్వేషన్లు 15 ఏళ్ల పాటు అమల్లో ఉండేలా ప్రతిపాదించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.కొత్త ప్రతిపాదన ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు 50 శాతం పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రాల వారీగా ప్రస్తుతం ఉన్న స్థానాలు, ప్రతిపాదిత పెంపు వివరాలు ఇలా ఉన్నాయి.

డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ఆధారంగా లోక్‌సభ స్థానాలను పునర్విభజిస్తే జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళనలు గతంలో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమ పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని అభ్యంతరాలు తెలిపాయి.

ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తక్కువగా ఉండటమే ఈ ఆందోళనలకు ప్రధాన కారణం. జనాభా ఆధారంగా మాత్రమే సీట్లను కేటాయిస్తే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు ఏకరీతిలో 50 శాతం సీట్ల పెంపు… 2051 వరకు రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని కొనసాగించే ప్రతిపాదన తీసుకొచ్చారు.