STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 2:47 pm Posted by : ARUN

India Measles: ప్రతి చిన్నారికి తట్టు వ్యాక్సినేషన్‌… భారత్ భారీ పురోగతి!

భారత్‌లో తట్టు వ్యాధి నివారణకు చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం గణనీయమైన పురోగతి సాధించింది. దేశంలో తొలి డోస్ టీకా తీసుకున్న పిల్లల సంఖ్య 98 శాతానికి చేరగా.. రెండో డోస్ తీసుకున్న వారి సంఖ్య 95 శాతంగా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ , యునిసెఫ్ గణాంకాల ప్రకారం 2025లో ఈ స్థాయి వ్యాక్సినేషన్ కవరేజీ నమోదైంది. అయితే ఇంతటి పురోగతి సాధించినప్పటికీ 2026 చివరి నాటికి తట్టు, రుబెల్లా వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యాన్ని భారత్ చేరుకునే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

2001లో గణాంకాల నమోదు ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా.. తట్టు వ్యాక్సిన్ తీసుకోని పిల్లలు అత్యధికంగా ఉన్న టాప్-10 దేశాల జాబితా నుంచి భారత్ బయటపడింది. అయినప్పటికీ 2025లో దేశవ్యాప్తంగా 17,995 తట్టు కేసులు నమోదయ్యాయి. 2023లో నమోదైన 65,150 కేసులతో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల. అయితే వ్యాక్సినేషన్ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యాధి వ్యాప్తి పూర్తిగా ఆగలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారత్‌లో 2029 నాటికి స్థానికంగా తట్టు వైరస్ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 2032 నాటికి వ్యాధి నిర్మూలనకు సంబంధించిన అధికారిక ధ్రువీకరణ పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రతి సంవత్సరం భారత్‌లో దాదాపు 2.3 కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారు. ఇంత భారీ జనాభాకు వ్యాక్సినేషన్ అందించడం పెద్ద సవాలే అయినప్పటికీ.. దేశం గణనీయమైన పురోగతి సాధించిందని డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు ప్రశంసించారు. అయితే ప్రస్తుతం సాధించిన వ్యాక్సినేషన్ స్థాయిని కొనసాగించడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. తట్టు వ్యాధి నిర్మూలనకు దేశవ్యాప్తంగా అధిక శాతం వ్యాక్సినేషన్ సాధించడం ఒక్కటే సరిపోదు. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకోని పిల్లలు ఉన్నప్పటికీ అక్కడ వ్యాధి వ్యాప్తి కొనసాగే ప్రమాదం ఉంటుంది.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ సగటు 95 శాతానికి పైగా ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో టీకాలు అందని పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా తక్కువ వ్యాక్సినేషన్ నమోదైన ప్రాంతాలు, కొన్ని సామాజిక వర్గాల్లో వ్యాధి వ్యాప్తి కొనసాగుతోంది. ఈ పరిస్థితి వైరస్ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోవడంలో అడ్డంకిగా మారుతోంది.