STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 12:08 pm Posted by : ARUN

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై ముందుగానే మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇకపై మనకు నచ్చిన తేదీ, సమయానికి మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా వెళ్లేలా ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. కేవలం టెక్ట్స్‌ మెసేజ్‌లే కాకుండా ఫొటోలు, వీడియోలు, లింకులను కూడా షెడ్యూల్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది.

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ విషయాన్ని కునాల్ షా తన బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. వినియోగదారులు చాలా కాలంగా కోరుకుంటున్న ఫీచర్లలో ఇది ఒకటిగా వాట్సాప్ పేర్కొంది.

ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు కనీసం 10 నిమిషాల నుంచి గరిష్ఠంగా 14 రోజుల ముందుగానే మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. మీ స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండాల్సిన అవసరం లేదు. ముందుగానే మెసేజ్ టైప్ చేసి, పంపాల్సిన తేదీ, సమయాన్ని ఎంచుకుంటే సరిపోతుంది. నిర్ణయించిన సమయంలో మెసేజ్ ఆటోమేటిక్‌గా వెళ్లిపోతుంది. ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉన్నప్పటికీ షెడ్యూల్ చేసిన మెసేజ్ పంపబడుతుందని కథనం పేర్కొంది.

ఈ సదుపాయం వ్యక్తిగత చాట్స్‌తో పాటు గ్రూప్ చాట్స్‌లోనూ పనిచేస్తుంది. టెక్స్ట్ మెసేజ్‌లతో పాటు ఫొటోలు, వీడియోలు, లింకులను కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు.
వాట్సాప్‌లో మెసేజ్‌లను ఎలా షెడ్యూల్ చేయాలి?

వాట్సాప్‌లో మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవడానికి ఈ విధానాన్ని అనుసరించాలి.

1. ముందుగా మీరు మెసేజ్ పంపాలనుకుంటున్న వాట్సాప్ చాట్‌ను ఓపెన్ చేయాలి.
2. ఆ తర్వాత పంపాలనుకుంటున్న టెక్ట్స్‌ మెసేజ్ టైప్ చేయాలి లేదంటే ఫొటో లేదా వీడియోను ఎంచుకోవాలి.
3. ఇప్పుడు సెండ్ బటన్‌పై నొక్కి పట్టుకోవాలి.
4. వెంటనే స్క్రీన్‌పై తేదీ, సమయం ఎంచుకునే ఆప్షన్ కనిపిస్తుంది.
5. మీకు కావాల్సిన తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకోవాలి.
6. చివరగా కన్ఫర్మ్ చేస్తే మెసేజ్ షెడ్యూల్ అవుతుంది.

వాట్సాప్‌లో సాధారణంగా పంపించే మెసేజ్‌ల మాదిరిగానే షెడ్యూల్ చేసిన మెసేజ్‌లకు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) రక్షణ ఉంటుంది. అంటే వినియోగదారుల మెసేజ్‌ల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది.

షెడ్యూల్ చేసిన మెసేజ్‌లు సాధారణ మెసేజ్‌ల మాదిరిగానే అవతలి వ్యక్తికి కనిపిస్తాయి. ప్రత్యేకంగా షెడ్యూల్ చేసిన మెసేజ్ అని గుర్తించే విధంగా ఉండదని వాట్సాప్ తెలిపింది.

ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే కొంతమంది వినియోగదారుల మొబైల్స్‌లో ఈ ఫీచర్ ఇంకా కనిపించకపోవచ్చు. త్వరలో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.