STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 12:00 pm Posted by : ARUN

Tata Trusts: చంద్రశేఖరన్ పునర్నియామకంపై హైకోర్టుకు టాటా ట్రస్ట్‌లు!

టాటా గ్రూపులో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను రెండోసారి ఐదేళ్ల కాలానికి తిరిగి నియమించడాన్ని సవాలు చేస్తూ రెండు టాటా ట్రస్టులు బాంబే హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించాయి. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ , ఆర్‌డీ టాటా ట్రస్ట్ ఈ మేరకు తీర్మానం చేశాయి.

చంద్రశేఖరన్ పునర్నియామకానికి సంబంధించి టాటా సన్స్ బోర్డు తీసుకున్న నిర్ణయం చెల్లదని ఈ రెండు ట్రస్టులు వాదిస్తున్నాయి. సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్‌ను తిరిగి నియమిస్తూ తీర్మానం చేశారు. అయితే కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 121 ప్రకారం అవసరమైన అనుకూల ఓట్లు ఈ తీర్మానానికి లభించలేదని ట్రస్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించడంతో పాటు టాటా సన్స్ బోర్డుపై మరో ప్రత్యేక న్యాయపోరాటానికి కూడా ట్రస్టులు సిద్ధమయ్యాయి. బోర్డు నుంచి రూ.50 కోట్ల పరిహారం కోరాలని నిర్ణయించాయి. అలాగే బోర్డులోని ఆరుగురు డైరెక్టర్లపై కూడా వేర్వేరుగా దావా వేయాలని భావిస్తున్నాయి. ఒక్కో డైరెక్టర్ నుంచి రూ.15 కోట్ల చొప్పున నష్టపరిహారం, దానిపై ఏటా 18 శాతం వడ్డీని డిమాండ్ చేయనున్నట్లు కథనం పేర్కొంది.

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్టులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో టాటా గ్రూపులో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే గ్రూపు భవిష్యత్ వ్యూహాలు, బోర్డు నిర్ణయాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ న్యాయపోరాటం మరింత ఆసక్తికరంగా మారింది.