చారిత్రక కట్టడాలు, అద్భుతమైన సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, నోరూరించే వంటకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు స్పెయిన్‌లోని బీచ్ పట్టణాల సొంతం. అట్లాంటిక్ మహాసముద్ర తీరంలోని గలీషియా, అండలూసియా ప్రాంతాల నుంచి మధ్యధరా సముద్ర తీరంలోని ప్రశాంతమైన బీచ్‌ల వరకు స్పెయిన్‌లో విభిన్నమైన తీర ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయ వంటకాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ తీర ప్రాంతాలు విహారయాత్రలకు అద్భుతమైన గమ్యస్థానాలు. విలాసవంతమైన పర్యాటకం, సర్ఫింగ్, రుచికరమైన ఆహారం లేదా ప్రశాంతంగా సముద్ర తీరంలో గడపాలని కోరుకునే వారికి ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి.
() శాన్ సెబాస్టియన్
యూరప్‌లోని అత్యుత్తమ బీచ్ పట్టణాల జాబితాలో శాన్ సెబాస్టియన్ తరచూ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇక్కడి ప్లేయా డి లా కాంచా బీచ్ యూరప్‌లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నగర బీచ్‌లలో ఒకటి. చుట్టూ అందమైన కొండలు, అద్భుతమైన సముద్ర తీరం పర్యాటకులకు కనువిందు చేస్తాయి. పాత పట్టణంలో పింట్క్సో బార్లు, మిషెలిన్ స్టార్ రెస్టారెంట్లు, స్థానిక ఉత్సవాలు సందడి చేస్తుంటాయి. సముద్ర తీరంలో ప్రశాంతంగా గడపడమే కాకుండా బాస్క్ సంప్రదాయాలు, ప్రత్యేకమైన ఆహార సంస్కృతిని ఆస్వాదించవచ్చు. మే నుంచి జూన్ వరకు, అలాగే సెప్టెంబర్ నెలలో ఇక్కడ పర్యటించడం ఉత్తమం. ఈ సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో పాటు వేసవి రద్దీ కూడా తక్కువగా ఉంటుంది.
() మార్బెల్లా
విలాసవంతమైన పర్యాటకాన్ని ఇష్టపడేవారికి మార్బెల్లా మంచి ఎంపిక. అందమైన బీచ్‌లు, చారిత్రక కట్టడాలు, షాపింగ్, రుచికరమైన ఆహారం, రాత్రి వేళల్లో సందడి చేసే వినోద కేంద్రాలతో ఈ పట్టణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మార్బెల్లాలో పాతకాలపు అందం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఇక్కడి బీచ్‌లు అద్భుతంగా ఉంటాయని, పాత పట్టణ వీధుల్లో నడుస్తూ ఫ్యాషన్, ఆహారం, నైట్‌లైఫ్‌ను ఆస్వాదించవచ్చు.
()డెయా
స్పెయిన్‌లోని మల్లోర్కా ద్వీపం మొత్తం పర్యాటకులకు అందమైన అనుభూతిని అందిస్తుంది. అయితే అందులో డెయా పట్టణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ తీర గ్రామం ఒకే రాతితో చెక్కినట్టుగా కనిపిస్తుంది. ప్రధాన వీధిలో అందమైన చిన్న దుకాణాలు, కేఫ్‌లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. డి మోనియో కేఫ్‌లో రుచికరమైన ఆహార పదార్థాలతో పాటు చేతితో తయారు చేసిన ఆభరణాలు, సిరామిక్ వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి.ఇక్కడి నుంచి కాలా డెయా బీచ్‌కు వెళ్లి స్వచ్ఛమైన, నీలిరంగు సముద్ర జలాల్లో ఈత కొట్టవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలను ఇష్టపడేవారికి ఈ ప్రాంతం చక్కటి ఎంపిక.
()ఎస్టెపోనా
రద్దీకి దూరంగా ప్రశాంతమైన విహారయాత్రను కోరుకునేవారికి ఎస్టెపోనా అనువైన ప్రదేశం. స్పెయిన్ రియల్ ఎస్టేట్ సంస్థ క్లౌడ్ నైన్ స్పెయిన్ మేనేజింగ్ డైరెక్టర్ సీన్ వూలీ ఈ పట్టణాన్ని ప్రత్యేకంగా సిఫార్సు చేశారు.మార్బెల్లాకు ప్రత్యామ్నాయంగా ఎస్టెపోనా మంచి గుర్తింపు పొందుతోంది. పునరుద్ధరించిన పాత పట్టణం, పూలతో అలంకరించిన వీధులు, అద్భుతమైన బీచ్‌లు ఇక్కడి ప్రత్యేకతలు. అంతేకాకుండా రద్దీ తక్కువగా ఉండే విశాలమైన ఇసుక తీరాలు పర్యాటకులకు ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి.వీధుల నిండా రంగురంగుల పూలతో అలంకరణలు కనిపిస్తాయి. మంచి హోటళ్లు, రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రెస్టారెంట్ లా ఎస్కొల్లెరా ఎస్టెపోనా ఆహార ప్రియులను ఆకట్టుకుంటుంది.
()కడాకెస్
స్పెయిన్‌లోని ప్రసిద్ధ బీచ్‌లను మాత్రమే చూసి తిరిగి వెళ్లకుండా, అక్కడి సంస్కృతి, ప్రకృతి అందాలను ఆస్వాదించాలని ట్రావెల్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో కడాకెస్ ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతంగా నిలుస్తుంది.కోస్టా బ్రావా తీరంలోని ఈ పాత మత్స్యకార గ్రామం కళాత్మక వారసత్వానికి ప్రసిద్ధి. ప్రముఖ చిత్రకారుడు సాల్వడార్ డాలీ కళా వారసత్వం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.రాతి వీధులు, తెల్లని రంగుతో మెరిసే ఇళ్లు, ఎత్తైన సముద్రపు కొండలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. సమీపంలోని క్యాప్ డి క్రూస్ నేషనల్ పార్క్ కూడా తప్పక సందర్శించాల్సిన ప్రాంతం. ఉదయం వేళల్లో ప్రశాంతమైన చిన్న బీచ్‌లలో ఈత కొట్టవచ్చు. అనంతరం ఇరుకైన వీధుల్లో విహరిస్తూ కళాత్మక కట్టడాలను చూడవచ్చు. సమీపంలోని పోర్ట్లిగాట్లో ఉన్న డాలీ ఇంటిని సందర్శించడంతో పాటు పడవ ప్రయాణం ద్వారా క్యాప్ డి క్రూస్ ప్రాంతాన్ని ఆస్వాదించవచ్చు.
()6. తారిఫా
యూరప్ ఖండం చివరి అంచున ఉన్నట్టుగా అనిపించే ప్రత్యేకమైన పట్టణం తారిఫా. ఇక్కడి నుంచి సముద్రం అవతల మొరాకో దేశాన్ని కూడా చూడవచ్చు. అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం కలిసే ప్రాంతానికి సమీపంలో ఉండటం దీని ప్రత్యేకత. ఇక్కడి బీచ్‌లు ఎంతో విశాలంగా, అంతులేని ఇసుక తీరాలతో కనిపిస్తాయి. ఒకవైపు అట్లాంటిక్ సముద్రపు అలలు, మరోవైపు మధ్యధరా సముద్రపు ప్రశాంతత పర్యాటకులకు విభిన్న అనుభూతిని అందిస్తాయి.రెండు ఖండాల మధ్య వీచే బలమైన గాలుల కారణంగా తారిఫా కైట్ సర్ఫింగ్, విండ్సర్ఫింగ్ క్రీడలకు ప్రసిద్ధి చెందింది. మే నుంచి జూన్ వరకు, అలాగే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఇక్కడ పర్యటించడం మంచిది. ఈ సమయంలో వాతావరణం అనుకూలంగా ఉండటంతో పాటు సర్ఫింగ్ క్రీడాకారుల విన్యాసాలను చూడవచ్చు.