STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 11:40 am Posted by : ARUN

Nvidia: చైనా సంస్థల చేతుల్లోకి అమెరికా ఏఐ చిప్స్.. ఆందోళనలో ట్రంప్ సర్కార్!

ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్స్ తయారీ సంస్థగా పేరొందిన ఎన్విడియా చుట్టూ కొత్త వివాదం మొదలైంది. చైనా యాజమాన్య సంబంధాలున్న అమెరికాకు చెందిన కొన్ని సంస్థలకు ఎన్విడియా అత్యాధునిక ఏఐ చిప్స్ విక్రయిస్తున్నట్లు సీబీఎస్ న్యూస్ (CBS News) జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిణామం అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను పెంచుతోంది. చైనా వంటి ప్రత్యర్థి దేశాలకు కీలక సాంకేతిక పరిజ్ఞానం చేరకుండా అడ్డుకోవాలన్న అమెరికా ప్రయత్నాలకు ఇది సవాలుగా మారింది.

సీబీఎస్ న్యూస్ పరిశోధన ప్రకారం.. ఎన్విడియాకు చెందిన ప్రాధాన్య భాగస్వాముల్లో ఒకటి కాలిఫోర్నియాలో ఉన్న సంస్థ. అయితే దీనికి చైనాకు చెందిన కంపెనీ యాజమాన్య సంబంధాలు ఉన్నాయి. ఈ సంస్థ సీఈఓ చైనా సైనిక విశ్వవిద్యాలయంలో చదువుకున్నట్లు పరిశోధనలో గుర్తించారు. మరో కాలిఫోర్నియా సంస్థ తన చైనా మాతృసంస్థను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన తర్వాత పేరును మార్చుకున్నట్లు వెల్లడైంది.

చైనా యాజమాన్య సంబంధాలున్న అమెరికా కంపెనీలు ఎన్విడియా నుంచి పొందిన అత్యాధునిక ఏఐ చిప్స్‌ను ఆ తర్వాత ఆగ్నేయాసియాలోని ఇతర కంపెనీలకు విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం చేసినట్లు పరిశోధన గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిప్స్ ఎగుమతి వ్యవస్థ, కంపెనీల యాజమాన్య నిర్మాణాలు, సరఫరా గొలుసుల్లోని అనేక దశల కారణంగా ఈ చిప్స్ చివరకు చైనాకు ఎంతమేర చేరుతున్నాయో గుర్తించడం కష్టంగా మారిందని నివేదిక పేర్కొంది.

వాషింగ్టన్‌కు చెందిన అంతర్జాతీయ భద్రతా సంస్థ C4ADS సీనియర్ విశ్లేషకురాలు మిషెల్ కొండి ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పర్యవేక్షణ, నిబంధనల అమలు సంస్థలకు తగిన వనరులు కల్పించడం, ప్రైవేట్ టెక్నాలజీ కంపెనీలు తమ సరఫరా వ్యవస్థల్లోని ప్రమాదాలను గుర్తించడం అవసరమని పేర్కొన్నారు.

ఏఐ కంప్యూటింగ్ రంగంలో అత్యుత్తమంగా భావించే ఎన్విడియా చిప్స్ చైనాకు చేరకుండా అమెరికా ప్రభుత్వం గత కొంతకాలంగా కఠిన చర్యలు తీసుకుంటోంది. గతేడాది చైనాలో ఎన్విడియా దాదాపు 20 బిలియన్ డాలర్ల విక్రయాలు నమోదు చేసినట్లు సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. వ్యక్తిగత కంప్యూటర్లకు ఉపయోగించే గ్రాఫిక్స్ కార్డులు, తక్కువ సామర్థ్యం కలిగిన సర్వర్ చిప్స్‌ను ప్రత్యేక అనుమతులు లేకుండానే చైనాలో విక్రయించే అవకాశం ఉంది. అయితే అత్యాధునిక చిప్స్ ఎగుమతులపై మాత్రం అమెరికా కఠిన నియంత్రణలు విధించింది.