సోషల్ మీడియా వేదికగా పరిచయం పెంచుకుని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన ఓ యువకుడు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన నగ్న వీడియోలను వైరల్ చేస్తానని బెదిరిస్తూ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి ప్రస్తుతం హైదరాబాద్‌లోని అత్తాపూర్ పరిధి శివనగర్ కాలనీలో నివసిస్తోంది. స్వయం ఉపాధి ద్వారా జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం స్నాప్‌చాట్ ద్వారా కార్తీక్ (32) అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఆమెతో మాట్లాడిన కార్తీక్.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు.
ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌కు రావాలని యువతిని పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెను హోటల్ గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమెకు సంబంధించిన నగ్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కత్తితో భయపెట్టాడు.
నిందితుడి బెదిరింపుల నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి అక్కడి నుంచి పారిపోయి ఇంటికి చేరుకుంది. అయితే హోటల్ గదిలో పడిపోయిన ఆమె ఫోన్‌ను కార్తీక్ ర్యాపిడో ద్వారా పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.